త్రిపుర మఖ్యమంత్రి పీఠాన్ని మరోసారి అధిష్ఠించనున్నారు 'మిస్టర్ క్లీన్' మాణిక్ సాహా. ఈ మేరకు సోమవారం సమావేశమైన బీజేపీ శాసనసభాపక్షం ఆయనను ముఖ్యమంత్రిగా ఎన్నుకుంది. బీజేపీ ఎమ్మెల్యేందరూ మాణిక్ సాహాను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని ఆ పార్టీ అధికార ప్రతినిధి తెలిపారు. ఈనెల 8న త్రిపుర సీఎంగా మాణిక్ సాహా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
రాజధాని అగర్తలలోని వివేకానంద మైదానంలో నిర్వహించనున్న కార్యక్రమంలో ముఖ్యమంత్రిగా మాణిక్ సాహాతోపాటు మరికొందరు మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీతోపాటు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకానున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
60 అసెంబ్లీ స్థానాలున్న త్రిపురలో 2018లో అధికారాన్ని దక్కించుకున్న బీజేపీ.. తాజా ఎన్నికల్లో సొంతంగా 32 సీట్లలో గెలిచింది. దాని మిత్రపక్షం IPFT ఒక స్థానం సంపాదించుకుంది.
అంతకుముందు త్రిపుర ముఖ్యమంత్రి అభ్యర్థిని మారుస్తారనే ఊహాగానాలు వ్యక్తమయ్యాయి. ఆయన స్థానంలో కేంద్ర మంత్రి ప్రతిమా భౌమిక్‌ను నియమిస్తారనే ప్రచారం సాగింది. దీంతో ఎవరు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహిస్తారన్న అంశంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ విషయంలో పార్టీలో విభేదాలు తలెత్తకుండా, ఏకాభిప్రాయంతో నిర్ణయం తీసుకునేందుకు వీలుగా ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించిన బీజేపీ కీలక నేత, అసోం ముఖ్యంత్రి హిమంత బిశ్వ శర్మను రంగంలోకి దింపింది ఆ పార్టీ. ముఖ్యమంత్రి అభ్యర్థికి సంబంధించి మాణిక్ సాహా పట్ల ఒక వర్గం సానుకూలత వ్యక్తం చేయగా.. మాజీ సీఎం విప్లవ్ దేవ్ మద్దతుదారులున్న మరో వర్గం కేంద్ర మంత్రి ప్రతిమా భౌమిక్‌కు మద్దతు తెలిపింది. తాజాగా జరిగిన ఎన్నికల్లో భౌమిక్.. ధన్‌పుర్ అసెంబ్లీ స్థానం నుంచి గెలుపొందారు. అంతకుముందు విప్లవ్ దేబ్ స్థానంలో సాహా గతేడాది మార్చి 14న త్రిపుర సీఎంగా బాధ్యతలు చేపట్టారు.
పశ్చిమ త్రిపురలో 1953, జనవరి 8లో జన్మించారు మాణిక్ సాహా. ఆయనకు భార్య స్వప్న సాహా, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. బిహార్ పట్నాలోని ప్రభుత్వ వైద్య కశాశాలలో బీడీఎస్, ఉత్తర్‌ప్రదేశ్ లఖ్‌నవూలోని కింగ్ జార్జ్ వైద్య కళాశాలలో ఎండీఎస్ పూర్తి చేశారు. పలు పత్రికలు, జర్నల్స్‌కు వ్యాసాలు కూడా రాస్తుంటారు సాహా. క్రీడలంటే ఎంతో మక్కువ ఉండే ఆయన స్వయంగా బ్యాడ్మింటన్ క్రీడాకారుడు. జాతీయ, యూనివర్సిటీ స్థాయిలో ప్రాతినిధ్యం వహించిన మాణిక్ సాహా పలు పతకాలు, సర్టిఫికెట్లు పొందారు. థాయిలాండ్, ఈజిప్టు, హాంకాంగ్, దుబాయి వంటి దేశాల్లో పర్యటించారు. ఇండియన్ డెంటల్ అసోసియేషన్‌లో శాశ్వత సభ్యుడిగా, ఇండియన్ డెంటల్ కౌన్సిల్ సభ్యుడిగా కొనసాగుతున్నారు.
ఇవీ చదవండి : ఈశాన్యం గెలుపుతో బీజేపీలో జోష్.. నెక్స్ట్ టార్గెట్ సౌత్