Urinating on SC Man: ఫుల్లుగా మద్యం తాగించి.. చితకబాది.. ఆపై నోట్లో మూత్రం పోసి.. - మూత్ర విసర్జన కేసులు
Urinating on SC Man in Ongole: ఆ ఇద్దరు యువకులు జులాయిలుగా తిరుగుతూ ఈజీ మనీ కోసం నేరాలకు పాల్పడేవారు. ఇళ్లల్లో చోరీలకు పాల్పడుతూ దోచుకున్న సొమ్ముతో జల్సాలు చేసుకోవడం అలవాటుగా మార్చుకున్నారు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య చిన్నపాటి గొడవ జరిగి అది కాస్తా మనస్పర్దలకు దారి తీసింది. ఈ క్రమంలో నెలరోజుల క్రితం ఒంగోలు శివారులో వీరిద్దరితో పాటు మరికొంతమంది యువకులు కలిసి మద్యం సేవించారు. తర్వాత ఓ యువుకుడిని విచక్షణారహితంగా చితకబాదారు. తనను వదిలేయాలంటూ బాధితుడు కాళ్లావేళ్లా పడ్డా కనికరించలేదు. అంతటితో ఆగలేదు. అతని నోట్లో మూత్రం పోసి, తాగాలంటూ చితకబాదారు. ఈ అమానవీయ ఘటన ఒంగోలులో వెలుగుచూసింది.
Urinating on SC Man in Ongole: అతనితో పూటుగా మద్యం తాగించారు. ఆ తర్వాత విచక్షణారహితంగా చితకబాదారు. తనను వదిలేయాలంటూ బాధితుడు కాళ్లావేళ్లా పడ్డా కనికరించలేదు. మరింత కసిగా కొట్టారు. రక్తమోడుతున్న గాయాలతో అతను విలవిల్లాడుతున్నా కనికరం చూపలేదు. వారిలోని పైశాచికత్వం అంతటితో ఆగలేదు. అతని నోట్లో మూత్రం పోసి, తాగాలంటూ చితకబాదారు. తనను వదిలేయాలంటూ బాధితుడు కాళ్లావేళ్లా పడి వేడుకున్నా వినిపించుకోలేదు. బూతులు తిడుతూ కసిగా కొట్టారు. మూత్రం పోస్తున్న వ్యక్తి మర్మాంగాన్ని నోట్లో పెట్టుకోవాలంటూ కొట్టారు. ఈ దారుణాన్ని సెల్‌ఫోన్‌లో చిత్రీకరించారు. ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలులో సుమారు నెల రోజుల క్రితం చోటుచేసుకున్న ఈ అమానవీయ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పోలీసులంటే అదురూబెదురూ లేకుండా ఒంగోలులో వేగరాళ్లు పేట్రేగిపోతున్న వైనం ప్రజలను భయాందోళనలకు గురిచేస్తోంది.
ఇద్దరూ నేరగాళ్లే: బాధితుడు మోటా నవీన్, ప్రధాన నిందితుడు మున్నె రామాంజనేయులు అలియాస్ అంజి ఇద్దరూ నేరగాళ్లే. ఇద్దరిపైనా సస్పెక్ట్ షీట్లు ఉన్నాయి. చిన్నతనం నుంచి జులాయిగా తిరుగుతూ ఎడాపెడా నేరాలకు పాల్పడిన వారే. బాధితుడు పలుమార్లు పోలీసులకు పట్టుబడి జైలుశిక్ష కూడా అనుభవించాడు. అంజి గత కొన్నేళ్లుగా పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. వీరిద్దరి మీదా సుమారు 50కి పైగా దొంగతనాల కేసులు ఉన్నాయి. బాధితుడు ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. గత కొంతకాలంగా వీరిద్దరి మధ్యా విభేదాలు నెలకొన్నాయి.
ఈ నేపథ్యంలో నెలరోజుల క్రితం రామాంజనేయులు.. మోటా నవీన్‌ను మద్యం తాగుదామంటూ ఒంగోలులోని స్థానిక కిమ్స్ వైద్యశాల వెనుకవైపుకు పిలిచాడు. పాత విబేధాలను మరిచి నవీన్ అక్కడకు వెళ్లాడు. అప్పటికే అక్కడ అంజితో పాటు ఇస్లాంపేట, గోపాల నగర్, బాపట్ల జిల్లా వేటపాలేనికి చెందిన తొమ్మిది మంది యువకులు ఉన్నారు. అందరూ ఫుల్లుగా మద్యం తాగారు. ఈ క్రమంలో అంజి పాత వివాదాన్ని తిరగదోడాడు. ఈ క్రమంలో మాటామాటా పెరిగింది. అప్పటికే ఒక పథకం ప్రకారం అక్కడ ఉన్న తొమ్మిదిమంది కలసి నవీన్‌పై దాడి చేశారు. తనను వదిలి పెట్టాలని బాధితుడు వేడుకుంటున్నా, కాళ్లావేళ్లా పడ్డా కనికరించలేదు. విచక్షణారహితంగా దాడిచేసి కొట్టారు. అంతటితో ఆగలేదు. అతడి నోట్లో మూత్రం పోస్తూ, తాగాలని బలవంతం చేస్తూ మరోసారి దాడిచేశారు. మర్మాంగాన్ని అతని నోట్లోకి చొప్పించే ప్రయత్నం చేశారు. ఈ మొత్తం వైనాన్ని వీడియోలో చిత్రీకరించారు. ఇప్పుడు ఈ వీడియోలు బయటకు వచ్చాయి.
కేసు నమోదు చేసుకుని చేతులు దులుపుకున్న పోలీసులు: నెలరోజులక్రితం జరిగిన ఈ వ్యవహారంపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు దీనిపై కేవలం దాడి, ఎస్సీ, ఎస్టీ కేసుగా నమోదు చేసి చేతులు దులుపుకున్నారు. కనీసం నిందితుల విచారణ, అరెస్టుకు సైతం ప్రయత్నించలేదు. పోలీసుల ఉదాసీన వైఖరితో నేరగాళ్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.
వీడియో వైరల్ కావడంతో..: తాజాగా నిందితుల్లో కొందరు ఈ వీడియోను సామాజిక మాద్యమాల్లో పెట్టారు. ఇది వైరల్‌గా మారి పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో పోలీసులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. ఈ కేసులో నిందితుల కోసం వెదుకులాట ప్రారంభించారు. దీనికి సంబంధించి ప్రధాన నిందితుడు పరారీలో ఉండగా, ఈ ఘటనలో పాలుపంచుకున్న వారిలో ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ సంఘటన నెలరోజుల క్రితం జరిగిందనీ, దానిపై అప్పట్లోనే ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసినట్లు, ప్రస్తుతం ఈ కేసులో కొందరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామనీ పోలీసులు తెలిపారు.