అమరవీరులపై ప్రేమను వినూత్నంగా చూపిస్తున్నాడు ఓ వ్యక్తి. వారు చేసిన త్యాగాలను ప్రత్యేకంగా స్మరణకు తెచ్చుకుంటున్నాడు. శరీరంపై టాటూలుగా 631 మంది అమరుల చిత్రాలను వేయించుకున్నాడు. వారి పేర్లను సైతం శరీరంపై రాయించుకున్నాడు. కార్గిల్ యుద్ధంలో అమరులైన సైనికుల త్యాగానికి గుర్తుగా ఈ పని చేశాడు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసికి చెందిన పండిత్ అభిషేక్ గౌతమ్ అనే వ్యక్తి.. ఇలా వినూత్నంగా అమరులపై అభిమానాన్ని చాటుతున్నాడు.
ఈ ప్రత్యేక కార్యక్రమంతో గిన్నిస్ రికార్డ్‌లో సైతం చోటు సంపాదించాడు అభిషేక్ గౌతమ్. అమరుల ఇళ్లను కూడా అభిషేక్ గౌతమ్ సందర్శిస్తున్నాడు. వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి అమరుల త్యాగాన్ని గుర్తు చేసుకుంటున్నాడు. అమరుల ఇంటి నుంచి మట్టిని తీసుకెళ్లి.. కార్గిల్ అమరవీరుల స్తూపం వద్ద ఉంచుతున్నాడు. 2019లో అమరుల స్తూపం వద్ద ఓ కలశాన్ని ఉంచిన అభిషేక్ గౌతమ్.. అందులోనే ఈ మట్టిని పెడుతున్నాడు. ఇప్పటి వరకు మొత్తం 559 అమరుల కుటుంబాలను కలిశానని అభిషేక్ గౌతమ్ చెబుతున్నాడు. మిగతా 72 అమరవీరుల కుటుంబాలను కూడా కలుస్తానని అతడు అంటున్నాడు.
పండిత్ అభిషేక్ గౌతమ్.. హాపూర్ జిల్లాకు చెందిన వ్యక్తి. వృత్తిరీత్యా ఓ ఇంటీరియర్ డిజైనర్. అమరులు, మహానుభావులపై అభిమానంతో వారి చిత్రాలను, పేర్లను తన వంటిపై టాటూగా వేయించుకుంటున్నాడు. అమరుల స్మారక స్తూపాన్ని, ఇండియా గేట్ బొమ్మను సైతం శరీరంపై టాటూలుగా వేయించుకున్నాడు. చాలా మంది ప్రముఖులు అభిషేక్ గౌతమ్‌ను సత్కరించారు. అతడు చేస్తున్న పనికి అభినందించారు. ఈ ప్రక్రియ ఇలాగే కొనసాగుతుందని అభిషేక్ గౌతమ్ చెబుతున్నాడు. నిరంతరం అమరులను తలుచుకుంటానని, వారి కుటుంబ సభ్యులను కలుస్తానని అంటున్నాడు.
అమరవీరుల కుటుంబాలకు పెట్రోల్ బంక్ అండ
దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వారి కుటుంబ సభ్యులకు అభిషేక్ తరహాలో మరికొందరు వ్యక్తులు, సంస్థలు తమదైన శైలిలో అండగా నిలుస్తున్నాయి. అలాంటి కోవకే చెందుతుంది ఛత్తీస్‌గఢ్‌లోని పెట్రోల్ బంక్. రాయ్‌పుర్‌కు 30 కిలోమీటర్ల దూరంలోని ధర్శివాన్ అనే గ్రామంలో ఉంటుందీ ఆదర్శ పెట్రోల్ బంక్. ఈ బంక్ ద్వారా వచ్చే ఆదాయంలో ఖర్చులన్నీ పోగా మిగిలిన సొమ్మును అమర జవాన్ల కుటుంబాలకు అందజేస్తోంది యాజమాన్యం. వీరమరణం పొందిన సైనికుల పిల్లల విద్య, వివాహం కోసం ఖర్చు చేస్తోంది. భవిష్యత్‌లో రెస్టారెంట్‌ను ప్రారంభించి.. వచ్చిన సొమ్ముతో జవాన్లు, పోలీసులకు ఉచితంగా భోజనం అందించాలని నిర్వాహకులు భావిస్తున్నారు. ఈ పెట్రోల్ బంక్ పూర్తి కథ కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.