Stealing women underwear: మహారాష్ట్ర కొల్హాపుర్లోని గార్గోటీ ప్రాంతంలో ఓ వ్యక్తి అందరి ఇళ్లల్లోకి చొరబడి మహిళల లోదుస్తులను చోరీ చేస్తున్నాడు. గత కొంతకాలంగా అనేక మంది ఇళ్లల్లో మహిళల లోదుస్తులు పోయిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఇటీవల ఓ న్యాయమూర్తి ఇంట్లోనూ ఈ ఘటన జరిగింది. పోలీసులకు ఫిర్యాదు చేసినా దొంగ దొరకలేదు. అయితే, ఇందుకు ఉపాయం ఆలోచించిన న్యాయమూర్తి.. స్వయంగా రంగంలోకి దిగి దొంగను కటకటాల వెనక్కి పంపడంలో కీలకంగా వ్యవహరించారు.
man steals woman's underwear
పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాత ఎనిమిది రోజుల పాటు నిరీక్షించినా.. దొంగ దొరకకపోవడం వల్ల.. న్యాయమూర్తి స్వయంగా ఓ పథకం రచించారు. ఇంటి బయట బట్టలు ఆరబెట్టి దొంగ కోసం నిరీక్షించారు.
ఈ క్రమంలోనే ఇంట్లోకి వచ్చిన దొంగ.. మహిళల లోదుస్తులు, బూట్లు, చెప్పులతో పరారయ్యేందుకు ప్రయత్నించాడు. వెంటనే జడ్జి, అతడితో పాటు ఉన్న మరో ఇద్దరు కలిసి దొంగను పట్టుకున్నారు. ఇదంతా సీసీటీవీలో రికార్డైంది.
దొంగను సుశాంత్ సదాశివ్ చావన్గా గుర్తించారు. గార్గోటీ కోర్టు ఉద్యోగి అయిన రంగారావు హరిచందం ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. నిందితుడు సుశాంత్ ఓ ప్రముఖ ఆస్పత్రిలో ఉద్యోగం చేస్తున్నాడని పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి: అండర్వేర్ల దొంగ.. లాండ్రీ నుంచి 730 లోదుస్తులు చోరీ