బిహార్ భాగల్‌పుర్‌కు చెందిన ఓ వ్యక్తికి, చిలుకకు ఉన్న స్నేహం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. తనను కాపాడిన వ్యక్తిని విడిచిపెట్టి ఉండలేక ఆయనతోనే ఉంటోంది ఓ చిలుక. కుప్పాఘాట్ మాయాగంజ్ ప్రాంతానికి చెందిన కలీమ్ విద్యుత్ శాఖలో పనిచేస్తున్నారు. కొన్ని రోజుల క్రితం ఓ చిలుక గాయపడి కనిపించింది. దీంతో దానిని ఇంటికి తీసుకెళ్లి చికిత్స అందించి దాని బాగోగులు చూసుకున్నారు కలీమ్. ఆ తర్వాత ఐదు నెలలు గడిచినా అది ఆయనను విడిచివెళ్లలేదు. దీంతో అప్పటి నుంచి ఆయనతో ఉంటూ వారింట్లో ఓ కుటుంబసభ్యుడిలా మారిపోయింది చిలుక. బైక్‌పై వెళ్లినా.. సరే ఆయన భూజాలపై వాలిపోయి ఆయనతో పాటే ప్రయాణిస్తోంది చిలుక.
"ఈ చిలుక ఎక్కడో గాయపడి నా వద్దకు వచ్చింది. దానికి చికిత్స చేసి.. నెల రోజుల పాటు దాని బాగోగులు చూసుకున్నాను. అప్పటి నుంచి అది నన్ను వదిలి వెళ్లడం లేదు. దానిని పంజరంలో పెట్టాను. అందులో పెట్టాక చిలుక చాలా ఇబ్బంది పడింది. దీంతో దానిని బయటకు తీశాను. గత ఐదు నెలలుగా చిలుక నాతోనే ఉంటుంది. దానికి జిమ్మి అని పేరు పెట్టాను"
- కలీమ్, చిలుకతో స్నేహం చేస్తున్న వ్యక్తి
తాను ఎక్కడికి వెళ్లినా చిలుక తనతోపాటే వస్తుందని కలీమ్ చెప్పారు. ఆఫీస్‌కు కూడా తనతో పాటే బైక్‌పై వస్తుందని తెలిపారు. జిమ్మి ఇతరుల వద్దకు వెళ్తుందని.. కానీ వారు ఏదైనా చేస్తే మాత్రం వారి మెడ, ముక్కుపై కొరుకుతుందని పేర్కొన్నారు. జిమ్మి ఇప్పటివరకు తనను కాని.. తన పిల్లలను కాని ఎలాంటి హానీ చేయలేదన్నారు. ఈ చిలుక.. కలీమ్ చెప్పే ప్రతి పదాన్ని, సైగలను అర్థం చేసుకుంటుంది. కలీమ్ సైతం చిలుక తన ఇంట్లో కుటుంబసభ్యుడిగా భావిస్తారు.
కొంగతో మనిషి స్నేహం
ఇటీవలే ఓ కొంగ కూడా మనిషితో స్నేహం చేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఉత్తర్‌ప్రదేశ్ అమేఠి జిల్లా మండ్కా గ్రామానికి చెందిన మహమ్మద్ ఆరిఫ్‌కు ఏడాది క్రితం ఈ కొంగ పరిచయమైంది. వరికోత యంత్రంపై పనిచేసే అతడికి.. ఓ పొలంలో కాలు విరిగి కదల్లేని స్థితిలో కొంగ కనిపించింది. నొప్పితో విలవిల్లాడుతున్న కొంగను ఇంటికి తీసుకొచ్చి దానికి చికిత్స చేశాడు. కొంగ నిలబడేందుకు వీలుగా.. దాని కాలికి వెదురు పుల్లలను కట్టాడు. ఫిబ్రవరిలో కొంగను తీసుకురాగా.. ఏప్రిల్ నాటికి అది పూర్తిగా కోలుకుంది. ఇక అది ఎగిరిపోతుందని ఆరిఫ్ భావించినా.. కొంగ మాత్రం అతడిని వదలలేదు. ఆ తర్వాత ఏమైందంటే.. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి