Man kills grandmother over property dispute : సినిమాలు చూసి ఓ తండ్రి తనయులు దారుణానికి పాల్పడ్డారు. సొంత తల్లి అని కనికరం లేకుండా కొడుకు, సొంత బామ్మ అని అనుకోకుండా మనవడు.. ఆ వృద్ధురాలిని అతి కిరాతకంగా చంపేశారు. హత్య చేసి ఏమి ఎరుగనట్టు ఆమెపై పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు విచారణ చేపట్టగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటన మహారాష్ట్ర పుణెలోని కేశవ్‌నగర్‌లో జరిగింది.
అసలేం జరిగిందంటే :
ఉషా విఠల్ గైక్వాడ్(64) అనే మహిళ దేహురోడ్‌లోని ఆర్మీ క్యాంప్‌లో పని చేసేవారు. పదవీవిరమణ తర్వాత ఆమె కేశవనగర్‌లో స్థిరపడ్డారు. ఇంట్లో ఆమెతో పాటు కొడుకు సందీప్ గైక్వాడ్(45), కోడలు, మనవడు సాహిల్ అలియాస్ గుడ్డు గైక్వాడ్(20) ఉండేవారు. తరచూ అత్త- కోడలి మధ్య వాగ్వాదం జరిగేది. ఈ క్రమంలోనే ఆగస్టు 5న ఉషకు కోడలితో మరోసారి గొడవ జరిగింది. పార్లే బిస్కెట్లు ఇవ్వలేదనే విషయంపై ఇరువురూ గొడవపడ్డారు. దీంతో కోడలు ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోయింది. కాగా, మధ్యాహ్నం సమయంలో వృద్ధురాలు నిద్రలోకి జారుకున్నారు. అప్పుడే మనవడు సాహిల్.. వృద్ధురాలిని హత్య చేశాడు. ఆమెను బాత్రూంలోకి లాక్కెళ్లి గొంతు నులిమి హతమార్చాడు.
ఆ తర్వాత ఆమె శరీరాన్ని మాయం చేసేందుకు తన తండ్రితో కలిసి అత్యంత కిరాతకమైన ప్లాన్ వేశాడు. ఓ దుకాణం నుంచి చెట్లను నరికే ఎలక్ట్రిక్ కటర్ను కొనుగోలు చేసుకొని ఇంటికి తీసుకొచ్చారు. ఆ కటర్‌తో మృతురాలి శరీరాన్ని ముక్కలు ముక్కలుగా కత్తిరించారు. శరీరాన్ని 9 భాగాలు చేసి సంచులలో కుక్కేశారు. కొన్ని బ్యాగ్‌లను బైక్‌పై, మరికొన్ని బ్యాగ్‌లను కారులో ఎక్కించారు. అనంతరం ఆ సంచులను వేసుకుని ముథా నది వద్దకు వెళ్లి ఆ నీటిలో మూడు సంచులను పడేశారు. పక్కనే ఉన్న చెత్త డిపోలో ఓ బ్యాగ్‌ను పారేశారు. రక్తంతో తడిచిన కత్తిని, దుస్తులను మజ్రీ నది ఒడ్డున వదిలేశారు.
ఇంత చేసిన తర్వాత తమ నేరాన్ని కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నించారు నిందితులు. వృద్ధురాలిపై పోలీసులకు మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు. ఆగస్టు 10న కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. అయితే ఎంతకీ ఆమె ఆచూకీ దొరకలేదు. అయితే, ఉష కూతురికి తన అన్నమీద అనుమానం వచ్చింది. సోదరుడే తన తల్లిని అపహరించుంటాడని మృతురాలి కూతురు కేసు పెట్టింది. పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. దీంతో అసలు నిజం బయటపడింది. ఉష కుమారుడు, మనవడే ఈ ఘాతుకానికి పాల్పడ్డట్లు తేలింది. వీరిద్దరిని రిమాండ్‌కు తరలించారు.
సినిమాల ప్రభావంతో..
విచారణలో ఉష మనవడు.. సాహిల్ గైక్వాడ్ సంచలన విషయాలు వెల్లడించాడు. తన బామ్మ ఆస్తిపై కన్నేసి ఈ హత్య చేసినట్లు తెలిపాడు. బంగారు ఆభరణాలన్నీ ఆమె పేరు మీదే ఉన్నాయని చెప్పుకొచ్చారు. అజయ్ దేవగణ్ నటించిన ఓ మలయాళీ రీమేక్ సినిమా చూసాకే తనకు చంపాలన్న ఆలోచన వచ్చిందని అతను తెలిపాడు. వృత్తి రీత్యా సాహిల్ ఓ గ్రాఫిక్ డిజైనర్ అని పోలీసులు వెల్లడించారు. అతడు యూట్యూబ్‌లో క్రైమ్‌కు సంబంధించిన సీరియల్స్ ఎక్కువగా చూస్తుంటాడని తెలిపారు. తన తండ్రి సందీప్ ప్రోత్సాహంతోనే ఈ హత్యకు పాల్పడినట్లు ఒప్పుకున్నాడని పోలీసులు వివరించారు. సందీప్ గైక్వాడ్.. రిపబ్లికన్ పార్టీ నగర అధ్యక్షుడిగా ఉన్నాడని తెలిపారు. వృద్ధురాలికి, నిందితులకు ఆస్తి తగాదాలు ఉన్నాయని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: దేశంలో పెరిగిన కొవిడ్ కేసులు.. 27 మంది మృతి.. జపాన్‌లో వ్యాప్తి తగ్గుముఖం!