అర్ధరాత్రి పూట ఓ వ్యక్తి బీభత్సం సృష్టించాడు. తన ఇద్దరు కుమార్తెలను అతి కిరాతకంగా పారతో కొట్టి హత్య చేశాడు. అంతటితో ఆగకుండా ఓ పోలీసు అధికారిపై దాడి చేసి చంపేశాడు. మొత్తం ఐదుగురు వ్యక్తులు అతడి కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన త్రిపురలో(Tripura killings) జరిగింది.
అసలేమైందంటే..?
ఖొవాయి(Tripura khowai news) పోలీస్ స్టేషన్ పరిధిలోని షియోరాతాలి ప్రాంతానికి చెందిన ప్రదీప్ దెబ్రాయ్(40).. తన భార్య మీనా దెబ్రాయ్(32) సహా తన ఇద్దరు కూతుళ్లు మందిరా దెబ్రాయ్(07), అదితీ దెబ్రాయ్(01)పై శుక్రవారం రాత్రి 11 గంటలకు పారతో దాడి చేశాడు. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. తీవ్ర గాయాలైన మీనా దెబ్రాయ్ ఆస్పత్రిలో ప్రస్తుతం చికిత్స పొందుతోంది. భార్యాబిడ్డలపై దాడి అనంతరం ప్రదీప్.. తన సోదరుడు అమలేస్ దెబ్రాయ్(45)పై కూడా దాడి చేసి, హత్య చేశాడు.
దాడిలో ఇన్స్పెక్టర్ మృతి
ఈ హత్యల సమాచారం అందుకున్న ఖొవాయ్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ సత్యజిత్ మాలిక్.. తన సిబ్బందితో ఘటనాస్థలికి చేరుకున్నారు. అయితే... సత్యజిత్ మాలిక్పైనా నిందితుడు దాడికి పాల్పడ్డాడు. తీవ్ర గాయాలైన ఆయనను ఖొవాయ్ ఆస్పత్రికి హుటాహుటిన తరలించారు. అనంతరం అక్కడి నుంచి ఏజీఎంసీ& జీబీపీ ఆస్పత్రికి తరలించారు. అదే రాత్రి చికిత్స పొందుతూ సత్యజిత్(Tripura police killed by man) ప్రాణాలు కోల్పోయారు.
ఆటోలో వెళ్తున్నవారిపై..
పోలీసులపై దాడి తర్వాత ప్రదీప్ తన పైశాచికత్వాన్ని కొనసాగించాడు. రోడ్డుపై ఆటోలో వెళ్తుండగా... నవోదయా ప్రాంతానికి చెందిన కృష్ణదాస్(45), కారందిర్ దాస్(22)పై దాడి చేశాడు. తీవ్ర గాయాలైన వారిద్దరినీ ఆస్పత్రికి తరలించామని పోలీసులు చెప్పారు. అక్కడ చికిత్స పొందతూ కృష్ణదాస్ మృతి చెందాడని వెల్లడించారు.
వీరిపై దాడి అనంతరం అప్రమత్తమైన పోలీసులు అదనపు బలగాలతో ఘటనాస్థలికి చేరుకున్నారు. ఎట్టకేలకు నిందితుడు ప్రదీప్ దెబ్రాయ్ను అదుపులోకి తీసుకున్నారు. అతనిపై ఐపీసీలోని వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. దీనిపై దర్యాప్తు చేపట్టారు.
ముఖ్యమంత్రి సంతాపం..
పోలీసు అధికారి సత్యజిత్ మాలిక్ మృతి(Tripura cm on police death) పట్ల త్రిపుర సీఎం బిప్లవ్ కుమార్ దేవ్ విచారం వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. నిందితుడి దాడిలో గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు.
ఇవీ చూడండి:
లావుగా ఉన్నావంటూ అత్తింట్లో అవమానం- పెళ్లైన పది నెలలకే ఆత్మహత్య!