తమ్ముడి మృతదేహాన్ని కొన్ని నెలలపాటు ఇంట్లోనే పెట్టుకుని నివసించాడు ఓ అన్న. ఇటీవల అతడు సైతం మరణించడం వల్ల ఈ విషయం బయటపడింది. ఈ ఘటన బంగాల్లోని ఉత్తర 24 పరగణాల జిల్లాలో ఆదివారం రాత్రి వెలుగు చూసింది. కుళ్లిపోయిన స్థితిలో ఓ మృతదేహం లభించగా.. అదే ఇంట్లో మరొక అస్థిపంజరం కూడా ఉంది.
ఇదీ జరిగింది
ఉత్తర బెల్ఘారియాకు చెందిన బీరేంద్ర కుమార్ దేబ్ (66) విద్యుత్ శాఖలో పనిచేసి పదవీ విరమణ పొందాడు. ఇతడికి ముగ్గురు సోదరులు కాగా.. వీరందరూ మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నారు. వీరిలో ఇద్దరు చాలా రోజుల కిందే మరణించారు. మరో సోదరుడు ధీరేంద్ర కుమార్ దేబ్(63) అతడితోనే ఉంటున్నాడు. కొన్ని నెలల కింద ధీరేంద్ర కుమార్ మరణించగా.. అతడికి అంత్యక్రియలు నిర్వహించలేదు బీరేంద్ర. అతడి మృతదేహాన్ని ఇంట్లోనే పెట్టుకుని ఉంటున్నాడు. అయితే.. ఇటీవల బీరేంద్ర కనిపించకపోవడం, ఇంట్లో నుంచి దుర్వాసన రావడం వల్ల అనుమానించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఇంట్లోకి వెళ్లి చూసి షాక్‌కు గురయ్యారు. బీరేంద్ర మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో కనిపించింది. అక్కడే ఓ అస్థిపంజరం కూడా పోలీసులకు లభ్యమైంది. దీనిపై విచారించి.. అస్థిపంజరాన్ని బీరేంద్ర సోదరుడు ధీరేంద్రగా నిర్ధరించారు. అతడు సుమారు 5-6 నెలల కిందటే మరణించి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. కానీ అతడి సోదరుడు అంత్యక్రియలు చేయకుండా ఇంట్లోనే ఉన్నాడని చెప్పారు.
కోమాలో ఉన్నాడని చెప్పి మృతదేహంతో ఏడాదిగా..
అంతకుముందు ఉత్తర్‌ప్రదేశ్‌లో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. చనిపోయిన కుటుంబ సభ్యుడి శవాన్ని ఏడాదిన్నర పాటు ఇంట్లోనే ఉంచారు. మృతదేహానికి కుటుంబ సభ్యులు రోజూ గంగాజలంతో స్నానం చేయించేవారని, 24 గంటలూ ఏసీ ఆన్‌లోనే ఉంచేవారని అధికారులు గుర్తించారు. మృతుడు శ్వాస తీసుకుంటున్నాడని భావించి.. ఇన్నిరోజులు జాగ్రత్తగా చూసుకున్నారని తేల్చారు.
కాన్పుర్ రావత్‌పుర్‌లోని శివపురి ప్రాంతానికి చెందిన విమలేశ్(38) అనే వ్యక్తి .. అహ్మదాబాద్‌లో ఆదాయపు పన్ను శాఖలో పనిచేసేవాడు. 2021 ఏప్రిల్ 22న అతడు మరణించాడు. అయితే విమలేశ్ మృతి చెందినా.. అతడు కోమాలో ఉన్నాడని అందరికీ చెబుతూ మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచుకున్నారు కుటుంబసభ్యులు. విమలేశ్ భార్య మిథాలీ స్థానిక కో-ఆపరేటివ్ బ్యాంక్‌లో మేనేజర్‌గా పనిచేస్తోంది. పెన్షన్ దరఖాస్తు చేయడానికి విమలేశ్ మరణ ధ్రువీకరణ పత్రాన్ని ఆమె సమర్పించగా.. మొత్తం విషయం బయటపడింది. ఆదాయ పన్నుశాఖ.. సీఎంఓకు ఈ విషయాన్ని తెలియజేసింది. సీఎంఓ వెంటనే మృతదేహాన్ని స్వాధీనం చేసుకోవాలని పోలీసులను ఆదేశించింది. పూర్తి వార్తను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
ఇవీ చదవండి : 3రోజులుగా కుమారుడి శవాన్ని ఇంట్లోనే ఉంచి విలపించిన తల్లి
భర్త శవంతో రెండ్రోజులు ఇంట్లోనే... పోలీసులు తలుపులు బద్దలు కొట్టగానే...