HUSBAND FORCED UNNATURAL SEX: భార్యను అసహజ శృంగారం కోసం బలవంతపెట్టిన వ్యక్తిపై కేసును కొట్టివేసేందుకు కర్ణాటక హైకోర్టు నిరాకరించింది. నిందితుడు అమాయకుడని నిరూపించేలా ఎలాంటి రికార్డులు లేవని పేర్కొంది. మరోవైపు, తన భర్త నేరాలపై సమగ్ర దర్యాప్తు చేయాలని భార్య వేసిన పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. ఆ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
వివరాల్లోకి వెళితే...
కోర్టులో కేసు వేసిన దంపతులిద్దరూ.. ఐఐటీ ముంబయిలో పీహెచ్డీ చేసే సమయంలో కలుసుకున్నారు. ఇద్దరి మధ్య పరిచయం కాస్తా ప్రేమగా మారింది. చివరకు 2015లో పెళ్లి చేసుకున్నారు. అనంతరం బెంగళూరులో స్థిరపడ్డారు. అయితే తొలి నుంచి భర్త తనను హింసిస్తున్నాడని మహిళ ఆరోపిస్తున్నారు. అసహజ శృంగారం కోసం తనను బలవంతం చేసేవాడని చెబుతున్నారు. భర్తతో విసిగిపోయిన మహిళ.. అతడికి దూరంగా తన తల్లిదండ్రుల వద్దే ఉంటున్నారు. లైంగికంగా వేధించబోనని మాటిచ్చి తన దగ్గరికి వచ్చేయాలని భర్త చెప్పేవాడు. అయితే, తన భర్త ప్రవర్తన మరింత తీవ్రంగా మారిపోయిందని మహిళ పేర్కొన్నారు. అనంతరం 2016 జనవరిలో అతడికి పూర్తిగా దూరమయ్యారు.
అప్పటి నుంచి భర్త మరో రూపంలో తన దుర్బుద్ధిని ప్రదర్శించడం మొదలుపెట్టాడు. మహిళ అసభ్య చిత్రాలను ఆమె తండ్రి ఫేస్బుక్ ఖాతాలకు ఫార్వర్డ్ చేశాడు. మహిళ స్నేహితుల వాట్సాప్ నెంబర్లకూ వాటిని పంపించాడు. దీంతో ఛత్తీస్‌గఢ్‌లో ఉంటున్న మహిళ.. అక్కడే తన భర్తతో పాటు అతడి తల్లిపై ఫిర్యాదు చేసింది. ఈ క్రిమినల్ కేసు.. బెంగళూరుకు బదిలీ అయింది. కాగా, 2019లో భర్త తల్లిపై నమోదైన కేసును కర్ణాటక హైకోర్టు కొట్టివేసింది. ఆ తర్వాత భార్యాభర్తలిద్దరూ పలు కారణాలతో ఒకరిపైఒకరు ఆరోపణలు చేసుకుంటూ హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన కేసును కొట్టివేయాలని మహిళ భర్త.. హైకోర్టును కోరాడు. మరోవైపు, పోలీసులు రూపొందించిన ఛార్జ్‌షీట్ తన కేసును నీరుగార్చేలా ఉందని మహిళ పేర్కొన్నారు. ఐటీ చట్టం కింద నమోదైన నేరాలపైనా సరైన దర్యాప్తు చేయలేదని అన్నారు.
ఈ రెండు పిటిషన్లపై విచారణ జరిపిన కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం నాగప్రసన్న.. ఒకే తీర్పు వెలువరించారు. మహిళ పిటిషన్‌ను స్వీకరించిన న్యాయమూర్తి.. కేసుపై మరింత దర్యాప్తు చేయాలని పోలీస్ కమిషనర్‌ను ఆదేశించారు. రెండు నెలల్లోగా రిపోర్టును జ్యురిస్డిక్షనల్ మేజిస్ట్రేట్ ముందు సమర్పించాలని స్పష్టం చేశారు. ఈ నివేదిక వచ్చేవరకు న్యాయస్థానంలో విచారణ జరగదని అన్నారు. కాగా, ఆరోపణలు ఎదుర్కొంటున్న భర్త పిటిషన్‌ను తిరస్కరించారు. కేసు కొట్టేయాలని కోరిన అతడు.. తాను అమాయకుడినని నిరూపించుకునేందుకు సరైన ఆధారాలు సమర్పించలేదని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు.
ఇదీ చదవండి: