పోలీసులు లంచం అడిగారని ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు ఓ వ్యక్తి. అపహరణకు గురైన తన కుమార్తెను వెతకడానికి పోలీసులు డబ్బు డిమాండ్ చేసినందుకే అతను ఉరి వేసుకున్నాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఉత్తర్‌ప్రదేశ్ బరేలీ జిల్లాలో ఈ ఘటన జరిగింది.
ఇదీ జరిగింది
బరేలి జిల్లాలో మవు చాంద్పుర్కి చెందిన శిశుపాల్ కుమార్తె ఇటీవల అపహరణకు గురైంది. దీంతో పెళ్లి కావాల్సిన తన కుమార్తెను వెతకమని రామ్‌నగర్ పోలీసులను ఆశ్రయించాడు శిశుపాల్. అయితే అందుకు రూ.లక్ష లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు స్టేషన్ ఇంచార్జ్‌గా ఉన్న రామ్ రతన్ సింగ్. దీంతో మనస్తాపానికి గురైన అతను ఉరి వేసుకున్నాడు.
ఈ విషయం తెలుసుకున్న రతన్ సింగ్.. ఘటనా స్థలానికి చేరుకున్నాడు. అతను సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకుని.. దాన్ని చించి జేబులో పెట్టుకున్నాడు. అయితే గ్రామస్థులు రతన్‌సింగ్‌ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
కిడ్నాప్ కేసు నమోదు
శిశుపాల్ ఫిర్యాదు మేరకు ఏప్రిల్ 9న అవలా పోలీస్ స్టేషన్లో అపహరణ కేసు నమోదు చేశారు పోలీసులు. ఇందులో బంటి, ముకేశ్, దినేశ్ అనే ముగ్గరు వ్యక్తులు తన కుమార్తెను ద్విచక్ర వాహనంపై అపహరించి తీసుకెళ్లినట్లు ఎఫ్‌ఐఆర్‌లో శిశుపాల్ ఆరోపించారు.
ఇదీ చూడండి: లోయలో పడిన మినీ బస్సు- ఆరుగురు మృతి