ఎంత మధురమైన గాత్రం..! ఈమె పాడుతున్న పాటను.. ఎవరైనా ఆదమరిచి వినాల్సిందే. జగన్నాథస్వామిని రెండు చేతులు జోడించి పూజిస్తున్న యువతీ.. ముఖానికి హిజాబ్ ధరించి, ఖాళీ చేతులతో అల్లాను ప్రార్థిస్తున్న యువతి.. ఇద్దరూ ఒకటే. అన్ని మతాల దేవుడూ ఒక్కటే అని నమ్మే ఈమె పేరు మాముని ఖాతూన్. ఒడిశా, బాలాసోర్ జిల్లాలోని సునారుయ్ గ్రామం ఈమె స్వస్థలం. ముస్లిం ఇంట్లో పుట్టిపెరిగినా.. జగన్నాథ స్వామిని నిత్యం పూజిస్తుంది మాముని.
చిన్నప్పటినుంచీ మామునికి హిందువుల పౌరాణిక గ్రంథాలు, వేదాలు చదవడమంటే విపరీతమైన ఆసక్తి. గాయంత్రిమంత్రం కళ్లుమూసుకుని పఠించగలదు. వినాయకుడి పూజలు సహా.. సంస్కృత మంత్రాలు మొత్తం చదివేస్తుంది మాముని.
"పుట్టుకతో నేను ముస్లిం అయినా.. జగన్నాథుడు అంటే నాకు చాలా భక్తి. ఆయన్ను పూజిస్తాను కూడా. ముస్లిం అయితే మాత్రం ఏంటి? అన్ని మతాల దేవుళ్లూ ఒక్కటే కదా! భజనలు కూడా పాడతాన్నేను. సంస్కృతంలో హానర్స్‌లో పాస్ అయ్యా. భవిష్యత్తులో సంస్కృత అధ్యాపకురాలు కావాలన్నదే నా లక్ష్యం."
-మాముని ఖాతూన్
జ్ఞానం లేకపోతే.. ఎంతటి శారీరక సౌందర్యమైనా ఒట్టిదేనని చెప్తోంది మాముని.
"ఒకరు చూసేందుకు ఎంత అందంగానైనా ఉండొచ్చు.. విజ్ఞానం లేకపోతే మాత్రం అదంతా వొట్టిదే. ఎవరూ మెచ్చుకోరు."
-మాముని ఖాతూన్
చదువులో మాముని ఎంతో చురుకు. కానీ కలలు నిజం చేసుకునేందుకు మాత్రం ఆమెకు పేదరికం అడ్డొస్తోంది. తండ్రి సాధారణ రైతు. ఉండేందుకు కనీసం పక్కా ఇల్లు కూడా లేదు. భవిష్యత్తులో చదువు కొనసాగించే పరిస్థితి లేదు. డబ్బు లేనందునే సంగీతం నేర్చుకోవాలన్న కోరికనూ చంపేసుకుంది మాముని.
"మా నాన్న రైతు. వేరేవాళ్ల ఇళ్లలో పనిచేస్తే వచ్చే డబ్బుతోనే మా ఇల్లు గడుస్తుంది. ఇప్పుడైతే చదువుకుంటున్నా గానీ.. మా పేదరికం వల్ల ఇకపై ఉన్నత చదువులు చదివే అవకాశం నాకు రాకపోవచ్చు. మేం చాలా బీదవాళ్లం. ఉండడానికి సరైన ఇల్లు కూడా లేదు. మాకేదైనా సహాయం చేయమని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నా."
-మాముని ఖాతూన్
సబ్‌కా మాలిక్ ఏక్ హై అనే నానుడిని నిజంగా ఆచరిస్తున్న మాముని కన్న కలలన్నీ నిజం కావాలని మనమంతా కోరుకుందాం.
ఇవీ చదవండి: మోదీ మెచ్చిన యువ కళాకారిణి.. భాగ్యశ్రీ
రోవర్ తయారీలో ఈ పిల్లలు పిడుగులే!