ఓ వైపు బంగాల్లో తొలి దశ పోలింగ్ జరుగుతుండగా... భాజపా నాయకులు విడుదల చేసిన ఆడియో క్లిప్ ఆ రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపుతోంది. స్వయంగా ముఖ్యమంత్రి మమత బెనర్జీ నందిగ్రామ్‌లో తన గెలుపు కోసం స్థానిక భాజపా నేత సాయం కోరినట్లు అందులో ఉండటం ఇందుకు కారణం. దీన్ని ఆసరాగా చేసుకుని కమలదళం తృణమూల్ అధినేత్రిపై విమర్శనాస్త్రాలను ఎక్కుపెట్టింది. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ఈ ఆడియో వైరల్‌గా మారింది.
ఈ విషయంపై భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయ వర్గీయ, ఇతర నేతలు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని కలిసి ఆడియో టెప్ను అందజేశారు. మమత ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
దీనిపై అధికార తృణమూల్ కాంగ్రెస్ మండిపడింది. మమత మాట్లాడిన ప్రలే పాల్ అనే వ్యక్తి తమ పార్టీ నుంచి భాజపాలో చేరారని.. ఆయన్ని వెనక్కి పిలవడంలో తప్పేంముందని కమలదళాన్ని ప్రశ్నించింది. అనవసర ఆరోపణలను మానుకోవాలని హితవు పలికింది.
ఫోన్లో ఏమన్నారు?
తాను ఇప్పటికీ సువేందు అధికారి కుటుంబానికి విధేయుడినని ప్రలే పాల్ తెలిపారు. నందిగ్రామ్ స్థానం నుంచి గెలిచేందుకు మమత తన సాయం కోరినట్లు ఆయన తెలిపారు.
"నందిగ్రామ్ గెలవడానికి మీరు మాకు సహాయం చేయాలి. మీకు ఏవో మనస్పర్ధాలు ఉన్నాయని నాకు తెలుసు. అధికారి ఉన్న కారణంగా నందిగ్రామ్‌లో నేను రాలేకపోయాను. ఇకనుంచి నేనే దగ్గరుండి అన్నింటినీ జాగ్రత్తగా చూసుకుంటాను," అని ఫోన్లో మమత చెప్పినట్టు ప్రలే పాల్ వెల్లడించారు.
ఏప్రిల్ 1న జరగనున్న ఈ ఎన్నికల్లో నందిగ్రామ్ నియోజకవర్గం నుంచి స్వయంగా దీదీ పోటీ చేస్తున్నారు. ఆమెకు ప్రత్యర్థిగా తృణమూల్ నుంచి బయటకు వచ్చిన సువేంధు అధికారి.. భాజపా నుంచి రంగంలోకి దిగుతున్నారు.
'మమతకు ఇప్పుడు అర్థమైంది..'
ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఓటమి భయం పట్టుకుందని భాజపా నేత శిశిర్ భజోరియా ఆరోపించారు. అందుకే నందిగ్రామ్ జిల్లా భాజపా వైస్ ప్రెసిడెంట్‌కు ఫోన్ చేసి సహాయం కోరారని తెలిపారు. పార్టీలోకి ఆహ్వానించడానికి కూడా ఇదే కారణమని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: 'ఓట్ల కోసమే మోదీ బంగ్లాదేశ్ పర్యటన'