కొవిడ్ 19 ఉద్ధృతి వేళ బంగాల్లో మిగిలిన అసెంబ్లీ స్థానాలకు ఒకే ధఫా ఎన్నికలను నిర్వహించాలని ఎన్నికల సంఘాన్ని కోరారు సీఎం మమతా బెనర్జీ. రాష్ట్రంలో సుదీర్ఘమైన 8 దశల పోలింగ్‌ను ఆది నుంచి తృణమూల్ కాంగ్రెస్ వ్యతిరేకిస్తున్నట్లు గుర్తుచేశారు. ప్రజా ప్రయోజనం దృష్ట్యా ఈ మేరకు చర్యలు తీసుకోవాలని ట్విట్టర్లో గురువారం విజ్ఞప్తి చేశారు.
"కరోనా మహమ్మారి నేపథ్యంలో బంగాల్ ఎన్నికలను 8విడతల్లో నిర్వహించాలన్న ఎన్నికల కమిషన్ నిర్ణయాన్ని తొలి నుంచి వ్యతిరేకిస్తున్నాం. ఇటీవల కేసులు భారీగా పెరుగుతున్నందున, మిగిలిన దశలను ఒకేసారి జరపాలని ఈసీని కోరుతున్నా."
- మమతా బెనర్జీ, బంగాల్ ముఖ్యమంత్రి
బంగాల్లో 234 సీట్లకు గానూ ఇప్పటికే నాలుగు విడతల్లో 135 నియోజక వర్గాలకు పోలింగ్ జరిగింది. ఏప్రిల్ 17న ఐదో దఫా కోసం అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. మిగిలిన 159 స్థానాలకు మూడు దశల్లో ఏప్రిల్ 17 నుంచి 29 వరకు ఎన్నికలకు జరగనున్నాయి.
మమతపై ఎఫ్ఐఆర్..
కూచ్‌బిహార్ కాల్పుల ఘటనలో సాయుధ దళాల ముట్టడికి ఓటర్లను ప్రేరేపించారనే ఆరోపణలపై మమతపై ఎఫ్ఐఆర్ నమోదైంది. జిల్లా భాజపా మైనారిటీ సెల్ అధ్యక్షుడు సిద్ధిఖీ అలీ మియా బుధవారం ఆమెపై ఫిర్యాదు చేశారు. నాలుగో దఫా ఎన్నికల సందర్భంగా మమత చేసిన ప్రసంగం.. సీఐఎస్ఎఫ్ బృందంపై దాడిచేసేలా ప్రజలను ఉసిగొల్పిందని ఆయన ఆరోపించారు. ఆమెపై పోలీసులు చర్యలు తీసుకోకపోతే భారీ ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.
ఏప్రిల్ 10న సీతల్కుచీలో జరిగిన ఈ ఘటనలో బలగాల కాల్పుల్లో నలుగురు మృతిచెందారు. ఆత్మ రక్షణ చర్యగా పోలీసులు దానిని అభివర్ణించారు.
ఇదీ చూడండి: బంగాల్ భాజపా అధ్యక్షుడిపై ఈసీ ఆంక్షలు