Mamata Banerjee on Congress: కాంగ్రెస్ పార్టీతో ఏ ఒక్క ప్రాంతీయ పార్టీకి సరైన సంబంధాలు లేవన్నారు బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. ఆ పార్టీ తన దారిలో వెళ్తోందని, తమ దారిలో తాము వెళ్తామన్నారు. భాజపా నేతృత్వంలోని కేంద్రం.. దేశ రాజ్యాంగాన్ని నాశనం చేస్తోందని ఆరోపించారు. దేశ సమైక్య విధానాన్ని కాపాడేందుకు చర్యలు తీసుకుంటున్నామని, అందుకోసం ప్రాంతీయ పార్టీలను కలుపుకొని ముందుకెళ్తున్నట్లు చెప్పారు దీదీ. తెలంగాణ, తమిళనాడు ముఖ్యమంత్రులతో మాట్లాడినట్లు తెలిపారు మమత.
ఈనెల 12న జరిగిన నాలుగు మున్సిపల్ సంస్థల ఎన్నికల్లో టీఎంసీ భారీ విజయం సాధించిన తర్వాత కోల్‌కతాలో మాట్లాడారు మమత. భాజపా నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సహా కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు.
"విధేయతగా ఉంటూ.. సామాన్య ప్రజల కోసం ప్రభుత్వ యంత్రాంగం పనిచేయాలి. గొప్ప ఆలోచనతోనే ఉత్తర్‌ప్రదేశ్‌లో తృణమూల్ కాంగ్రెస్ పోటీ చేయలేదు. మార్చి 3న వారణాసిలో ర్యాలీ నిర్వహిస్తాం. కాంగ్రెస్ పార్టీతో ఏ ఒక్క ప్రాంతీయ పార్టీకీ సరైన సంబంధాలు లేవు. ఆ పార్టీ తన దారిలో వెళ్తోంది. మేము మా దారిలో వెళ్తాం. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మాట్లాడాను. దేశ సమైక్య విధానాన్ని కాపాడేందుకు మేము కృషి చేస్తున్నాం. దేశ ప్రయోజనాల కోసం మాతో చేతులు కలపాలని కాంగ్రెస్, సీపీఎంను అడిగాను. అయితే, వారు వినకపోతే చేసేదేమి లేదు. నాకు ఎవరిపై వ్యక్తిగతంగా ద్వేషం లేదు."
- మమతా బెనర్జీ, బంగాల్ ముఖ్యమంత్రి.
ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికల్లో పోటీ చేసి.. సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్‌ను బలహీన పరచరాదనే యూపీలో పోటీకి నిలవలేదన్నారు మమత. తొలి దశలో 57 స్థానాల్లో అఖిలేశ్ పార్టీ 37 గెలుస్తుందని జోస్యం చెప్పారు.
టీఎంసీ క్లీన్‌స్వీప్..
ఈనెల 12న బంగాల్లో 4 మున్సిపాలిటీలకు జరిగిన ఎన్నికల్లో క్లీన్‌స్వీప్ చేసింది అధికార తృణమూల్ కాంగ్రెస్. ఓట్ల లెక్కింపు ప్రారంభమైన 2 గంటలకే టీఎంసీ భారీ మెజారిటీతో ముందంజలోకి వెళ్లింది. బిధాన్నగర్లో 41 స్థానాల్లో 39, అసన్సోల్లో 106 స్థానాల్లో 66, చందర్నాగోర్లో 32 సీట్లకు 31, సిలిగుడి మున్సిపాలిటీలో 47 స్థానాల్లో 37 గెలుచుకుంది. భాజపా, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు ఈ ఎన్నికల్లో ప్రభావం చూపలేకపోయాయి.
ఇదీ చూడండి: 'అత్యధిక బ్యాంకు మోసాలు మోదీ హయాంలోనే '