"కొవిడ్ వ్యాక్సిన్ పొందడం కోసం ఈ యాప్ ద్వారా మీ పేరు నమోదు చేసుకోండి. ఇందుకు ఈ లింకు క్లిక్ చేయండి" అంటూ ఫోన్లకు నకిలీ మెసేజ్‌లు వస్తున్నాయి. తద్వారా దుండగులు ఆయా ఫోన్లలోకి చొరబడి వాటిలో ఉన్న ఫోన్ నంబర్లను, డేటాను కాజేస్తున్నట్టు సైబర్ నిఘా అధికారులు గుర్తించారు. ఇలాంటి సంక్షిప్త సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలని 'ది ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్(సెర్ట్)' ప్రజలను హెచ్చరించింది. ఈ మేరకు తాజాగా సూచనలు జారీచేసింది.
"కొవిడ్ వ్యాక్సిన్‌కు సంబంధించి ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్ ఆధారంగా పనిచేనే స్మార్ట్ఫోన్లకు సంక్షిప్త సందేశాలు వస్తున్నాయి. వీటిలోని లింకును ఓపెన్ చేశాక.. యాప్ అనవసర అనుమతులన్నీ అడుగుతోంది. తద్వారా ఫోన్లోని కాంటాక్టు లిస్టు, ఇతర సమాచారాన్ని తస్కరించేందుకు వీలవుతోంది. Covid19.apk, vaci_Regis.apk, MyVaccin_v2.apk, Cov-Regis.apk, Vaccin-Apply.apk వంటి పేర్లతో ఈ నకిలీ యాప్ ఫైళ్లు ఉంటున్నాయి. వ్యాక్సిన్ విషయంలో ఇలాంటి సందేశాలు, ఈమెయిళ్లు, యాప్‌లను నమ్మొద్దు."
-సెర్ట్
కరోనా వ్యాక్సిన్ కోసం http://cowin.gov.in పేరున ఉన్న అధికారిక వెబ్ సైట్ ద్వారా మాత్రమే పేర్లను నమోదు చేసుకోవాలని సెర్ట్ తెలిపింది. ఫోన్ సెట్టింగ్స్ లోని "అన్‌ట్రస్టెడ్ సోర్సెస్" ఆప్షన్‌ను మార్చుకోవడం, నమ్మకమైన యాంటీ-వైరస్, ఇంటర్నెట్ ఫైర్ వాల్ టూలు వాడటం ద్వారా నకిలీ యాప్స్ బెడద నుంచి తప్పించుకోవచ్చు అని సూచించింది.
ఇదీ చూడండి: ఝార్ఖండ్‌లో ఈనెల 14 నుంచి 18 ప్లస్‌కి ఉచిత టీకా
ఇదీ చూడండి: 'సెంట్రల్ విస్టా వ్యయంతో 62 కోట్ల టీకా డోసులు'