తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కోసం తమ పార్టీ మేనిఫెస్టోను శుక్రవారం విడుదల చేశారు మక్కల్ నీది మయ్యం అధినేత కమల్ హాసన్. గృహిణులకు వారి నైపుణ్యాలను మెరుగుపర్చడం ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకునే అవకాశాన్ని కల్పిస్తామని హామీ ఇచ్చారు. తద్వారా వారు నెలకు రూ.10,000 నుంచి రూ.15,000 వరకు అందుకోగలుగుతారని పేర్కొన్నారు.
తమిళనాడులోని ప్రధాన పార్టీలైన ఏఐడీఎంకే, డీఎంకేలు ఇది వరకే మహిళలకు రూ.1,5000, రూ.1.000 ఇస్తామని హామీ ఇచ్చాయి.
"మహిళలకు ప్రభుత్వం నుంచి అందించే భృతిలా కాకుండా వారి నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలతో ఆదాయం సంపాదించుకునే అవకాశాన్ని కల్పిస్తాం. దీని వల్ల ప్రభుత్వంపై ఆర్థిక భారం పడకుండా ఉంటుంది. అదే సమయంలో మహిళలు తమ పనికి తగినట్లుగా గౌరవమైన వేతనం పొందగులుగుతారు. "
-కమల్ హాసన్, మక్కల్ నీది మయ్యం అధినేత
50 లక్షల మంది యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామని ఎంఎన్ఎం మేనిఫెస్టోలో కమల్ తెలిపారు. యువ వ్యాపారవేత్తలకు ప్రోత్సాహకాలు అందిస్తామని ప్రకటించారు. ప్రభుత్వ పాఠశాలలను అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టుగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు.
విద్యుత్ ఉత్పత్తి, సరఫరా సంస్థలు, రాష్ట్ర రవాణా సంస్థలు నష్టాలను ఎదుర్కొంటున్నాయని కమల్ అన్నారు. నష్టాల బారి నుంచి కాపాడుకునేందుకు ఉద్యోగులనే ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాదారులుగా మార్చాలని అభిప్రాయపడ్డారు.
ఇదీ చూడండి:ఎన్నికల వేళ ఐటీ దాడులు- రూ.16కోట్లు స్వాధీనం