Plane accident averted: రాంచీ ఎయిర్‌పోర్ట్‌లో ఓ విమానానికి పెను ప్రమాదం తప్పింది. బిర్సా ముండా విమానాశ్రయం నుంచి బయల్దేరిన ఇండిగో విమానం నుంచి భారీ స్థాయిలో శబ్దాలు వచ్చాయి. ఉదయం 9.05 గంటలకు విమానం టేకాఫ్ అవ్వాల్సి ఉంది. గాల్లో ఎగిరేందుకు విమానం రన్‌వేపై వేగంగా ప్రయాణిస్తున్న సమయంలోనే.. ఏసీ స్విచ్ ఆఫ్ అయిపోయింది.
Ranchi plane AC turn off: విమానంలో ఏసీ ఆగిపోగానే.. ఒక్కసారిగా శబ్దం వచ్చింది. దీన్ని విన్న ప్రయాణికులు భయంతో వణికిపోయారు. కొందరు గట్టిగా అరవడం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో పైలట్.. వెంటనే విమానం వేగాన్ని నియంత్రించారు. టేకాఫ్ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం, విమానాన్ని పార్కింగ్ ప్రదేశానికి తీసుకొచ్చినట్లు అధికారులు తెలిపారు. ప్రయాణికులందరినీ విమానం నుంచి దింపేశారు. ఇండిగో సంస్థకు చెందిన చిన్న విమానంలో సాంకేతిక సమస్య తలెత్తిందని రాంచీ ఎయిర్పోర్ట్ అథారిటీ డైరెక్టర్ వినోద్ శర్మ తెలిపారు. అధికారులు ఈ సమస్యను గుర్తించే పనిలో పడ్డారని చెప్పారు.
మరోవైపు, ఈ ఘటనపై విమాన ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల తీరును తప్పుబట్టారు. రన్‌వే నుంచి పార్కింగ్‌కు వచ్చిన తర్వాత 20 నిమిషాల వరకు డోర్లు ఎందుకు తెరవలేదని ప్రశ్నించారు. ఓ ప్రయాణికులు అత్యవసర ద్వారాన్ని తెరిచేందుకు ప్రయత్నించగా.. విమాన సిబ్బంది దురుసుగా ప్రవర్తించారని ఆరోపించారు. సాంకేతిక సమస్య ఉందని పైలట్ సమాచారం అందించినప్పటికీ.. విమానాశ్రయ అధికారులు అంబులెన్సులు, ఫైర్ ఇంజిన్లను ఎందుకు పంపించలేదని అడిగారు.
ఇదీ చదవండి: బంగాల్ అడవుల్లో ఆస్ట్రేలియా కంగారూలు.. తీవ్ర గాయాలతో నరకం.. స్మగ్లర్ల పనే!