మహిళా ట్రైనీ డాక్టర్ గదిలో స్పై కెమెరాలు పెట్టిన నేరంలో సీనియర్ డాక్టర్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన మహారాష్ట్రలోని పుణెలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. నగరంలోని ఓ మెడికల్ కాలేజీలో ట్రైనీగా పనిచేస్తున్న ఓ మహిళా డాక్టర్ రెసిడెన్షియల్ క్వార్టర్స్‌లో ఉంటున్నారు. కాగా.. ఇటీవల ఆమె ఇంట్లోని బాత్రూంలో బల్బు ఆన్ చేయబోతే వెలగలేదు. దీంతో ఎలక్ట్రిషియన్‌ను పిలిపించి మరమ్మతు చేయిస్తున్న క్రమంలో అందులో స్పై కెమెరా ఉన్నట్లు గుర్తించారు.
అలాగే.. బెడ్‌రూంలో కూడా స్పై కెమెరా ఉండటం చూసి ట్రైనీ డాక్టర్ కంగుతిన్నారు. వెంటనే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు అందర్ని విచారించగా.. మెడికల్ కాలేజీలో లెక్చరర్‌గా పనిచేస్తున్న 42 ఏళ్ల న్యూరాలజిస్ట్ డాక్టర్‌పై అనుమానం వ్యక్తమైంది. దీంతో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
నిందితుడైన వైద్యుడు.. బాధితురాలి గది తాళాలను ఆమె పర్స్ నుంచి దొంగిలించాడని భారతి విద్యాపీఠ్ పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు. పూర్తిస్థాయి దర్యాప్తు కొనసాగుతోందని.. త్వరలోనే మరిన్ని విషయాలను తెలియజేస్తామని వివరించారు.
ఇవీ చదవండి: