చేతబడి చేస్తున్నారనే అనుమానంతో అత్యంత దారుణంగా ఏడుగురిని కట్టేసి కొట్టారు ఓ గ్రామ ప్రజలు. ఈ ఘటనలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. మహారాష్ట్రలోని చంద్రాపుర్ జిల్లా జివిటి తాలూకాలోని వానిబుడ్రక్ గ్రామంలో శనివారం జరిగిందీ ఘటన.
![beaten on suspicion of witchcraft](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/mh-chd-01-7-people-beaten-due-to-hocus-pocus-vis-7204762_23082021110545_2308f_1629696945_518.jpg)
పోలీసుల రాకతో..
వానిబుడ్రక్ మహారాష్ట్రలోని ఓ మారుమూల గ్రామం. ఆ ఊరిలో ఏడుగురు వ్యక్తులు చేతబడి చేస్తున్నారని గ్రామస్థులు ఎప్పటినుంచో అనుమానిస్తున్నారు. దీంతో ఊరంతా ఏకమై అనుమానితులను గుంజకు కట్టేసి.. చితకబాదారు. ఈ విషయమై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని బాధితులను విడిపించారు. వీరిలో ఇద్దరు వృద్ధులు కూడా ఉన్నారు. క్షతగాత్రులను చంద్రాపుర్ జిల్లా ఆస్పత్రికి తరలించారు.
![beaten on suspicion of witchcraft](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/mh-chd-01-7-people-beaten-due-to-hocus-pocus-vis-7204762_23082021110545_2308f_1629696945_197.jpg)
![beaten on suspicion of witchcraft](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/mh-chd-01-7-people-beaten-due-to-hocus-pocus-vis-7204762_23082021110545_2308f_1629696945_867.jpg)
ఈ ఘటన అనంతరం గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో భారీ సంఖ్యలో పోలీసు సిబ్బందిని మోహరించారు అధికారులు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. 13 మందిని అరెస్టు చేశారు. దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.