COVID CASES: దేశంలో కొవిడ్ ఉద్ధృతి కొనసాగుతోంది. మహారాష్ట్రలో గురువారం మరో 4,225 కేసులు నమోదయ్యాయి. మహమ్మారితో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. 2,879మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. యాక్టివ్ కేసులు 20,634కు చేరాయి. గత నాలుగు నెలల్లో ఇవే అత్యధిక కేసులని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. రికవరీ రేటు 97.97గా ఉంది. మరణాల రేటు 1.86శాతంగా ఉంది. ఒక్క ముంబయి నగరంలోనే తాజాగా 2,366 కేసులు బయటపడ్డాయి.
మహారాష్ట్రలో ఇప్పటివరకు 79,23,697మంది కొవిడ్ బారినపడగా, వైరస్ వల్ల 1,47,880 మంది మరణించారు. బుధవారం 4,024 కేసులు నమోదవ్వగా, ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా ఒమిక్రాన్ వేరియంట్ కేసులు రెండు నమోదయయ్యాయని ఆరోగ్య శాఖ తెలిపింది. వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం బీఏ4, బీఏ5 వేరియంట్ కేసుల సంఖ్య 19కి చేరిందని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. రాష్ట్రంలో గత 24 గంటల్లో 44,695 కరోనా పరీక్షలు నిర్వహించారు. దీంతో ఇప్పటివరకు చేసిన కరోనా నిర్ధరణ పరీక్షలు 8,14,72,916కు చేరుకున్నాయి.
దిల్లీ కేసులు: దిల్లీలో బుధవారంతో పోల్చితే కొవిడ్ కేసులు స్వల్పంగా తగ్గాయి. గురువారం కొత్తగా 1,323మందికి కొవిడ్ సోకింది. వైరస్‌తో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. 1,016 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. 3,948 యాక్టివ్ కేసులు ఉన్నాయి. పాజిటీవిటి రేటు 6.69శాతంగా ఉంది.
89శాతం మందికి టీకా: దేశంలోని వయోజన జనాభాలో 89శాతం మందికి కొవిడ్ టీకాలు వేశామని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయా తెలిపారు. అయితే 12-14 ఏళ్ల వయస్సులో ఉన్న పిల్లల్లో 75 శాతానికి పైగా మొదటి డోస్ టీకా పూర్తైయినట్లు తెలిపారు. గురువారం ఉదయం 7 గంటల వరకు ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం టీకాలు 195.67 కోట్లకు దాటాయి. 18-59 సంవత్సరాల వయసు గల వారికి 3,66,18,99 ప్రికాషనరీ టీకా వేశామని తెలిపారు. 15 నుంచి 18 సంవత్సరాల మధ్య వయస్సు గల 5.99 కోట్ల మందికి మొదటి డోసు టీకా వేశామని తెలిపారు.
మరణాలపై డబ్ల్యూహెచ్ఓ ఆందోళన: గత ఐదు వారాలుగా తగ్గుతూ వస్తున్న కరోనా మరణాలు గత వారం 4శాతం మేర పెరగడంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. గురువారం విడుదల చేసిన వారం వారీ కేసుల వివరాల్లో.. గత వారం 8,700 కొవిడ్ మరణాలు సంభవించాయి. అమెరికాలో 21శాతం, పశ్చిమ పసిఫిక్‌లో 17శాతం పెరుగుదల కనిపించిదని తెలిపింది. కరోనా కేసులు తగ్గుతూనే ఉన్నా మరణాలు పెరగడంపై ఆందోళన వ్యక్తం చేసింది. గత వారంలో సుమారు 3.2 మిలియన్ కొత్త కేసులు నమోదయ్యాయని పేర్కొంది.
ఇవీ చదవండి: భారీ ఉగ్ర కుట్ర భగ్నం.. 15 కిలోల బాంబులు స్వాధీనం
'తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వెేయండి'.. ఈడీకి రాహుల్ విజ్ఞప్తి