Maharashtra politics SC verdict: మహారాష్ట్ర రాజకీయ ప్రతిష్టంభనపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రజాస్వామ్య సమస్యలకు సభలో బలనిరూపణ ఏకైక మార్గమని అభిప్రాయపడింది. గవర్నర్ ఆదేశాల ప్రకారం గురువారం బలపరీక్ష నిర్వహించాల్సిందేనని స్పష్టం చేసింది. అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించాలన్న మహారాష్ట్ర గవర్నర్ ఆదేశాలను సవాల్ చేస్తూ శివసేన చీఫ్ విప్ సునీల్ ప్రభు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీం.. ఈ మేరకు తీర్పు చెప్పింది. సునీల్ ప్రభు దాఖలు చేసిన పిటిషన్‌పై తుది ఫలితం.. అసెంబ్లీలో గురువారం జరిగే కార్యకలాపాలపై ఆధారపడుతుందని సుప్రీం వ్యాఖ్యానించింది.
వాదనల సందర్భంగా.. రెబల్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై డిప్యూటీ స్పీకర్ నిర్ణయం తీసుకునే వరకు బలపరీక్ష నిర్వహించడాన్ని అనుమతించకూడదని పిటిషనర్ సునీల్ ప్రభు.. న్యాయస్థానాన్ని కోరారు. సునీల్ ప్రభు తరఫున ప్రముఖ న్యాయవాది ఏఎం సింఘ్వి సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు. 'అనర్హతపై నిర్ణయం తీసుకోక ముందే బలపరీక్ష నిర్వహించడం అంటే.. పదో షెడ్యూల్‌ను అపహస్యం చేసినట్లే. గవర్నర్ సూపర్సోనిక్ వేగంతో బలపరీక్షకు ఆదేశించడం సరికాదు. ఇద్దరు ఎన్సీపీ ఎమ్మెల్యేలకు కొవిడ్ వచ్చిందని, మరో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు విదేశాల్లో ఉన్నారు. ఒక్కరోజు వ్యవధిలో వీరిని అసెంబ్లీకి హాజరుకావాలంటూ ఆదేశాలు జారీ చేయడం విడ్డూరం' అని సింఘ్వి పేర్కొన్నారు. తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేలు ప్రజల ఆకాంక్షలను పాటించడం లేదని, గురువారం బలపరీక్ష నిర్వహించకపోతే ఆకాశం ఊడిపడిపోదని వ్యాఖ్యానించారు.
కాగా, శిందే తరఫు న్యాయవాది ఈ వాదనను ఖండించారు. రెబల్ వర్గం తరఫున వాదనలు వినిపించిన సీనియర్ అడ్వొకేట్ ఎన్కే కౌల్.. అనర్హత పిటిషన్ పెండింగ్‌లో ఉండటం వల్ల బలనిరూపణను వాయిదా వేయడం సరికాదని వాదించారు. ఉద్ధవ్ వర్గం పార్టీలోనే మైనారిటీగా మారిపోయిందని, ఇక సభ గురించి చెప్పేదేముందని వ్యాఖ్యానించారు.
గోవా నుంచి ముంబయికి...?
గువాహటి హోటల్లో ఉన్న రెబల్ ఎమ్మెల్యేలు గోవాకు బయల్దేరారు. అక్కడి నుంచి ముంబయికి రానున్నట్లు తెలుస్తోంది. గోవాలోని ఓ హోటల్లో వీరి కోసం 70 గదులు బుక్ చేసినట్లు సమాచారం. బలపరీక్షకు తాము హాజరుకానున్నట్లు రెబల్ క్యాంప్‌ను నడిపిస్తున్న ఏక్నాథ్ శిందే తెలిపారు. ఈ పరీక్షలో తాము విజయం సాధిస్తామని మరో రెబల్ ఎమ్మెల్యే గులాబ్ రావ్ పాటిల్ పేర్కొన్నారు. అంతకుముందు, హోటల్ నుంచి బస్సులో బయల్దేరిన ఎమ్మెల్యేలు.. కామాఖ్య ఆలయాన్ని దర్శించుకున్నారు.
అసోం ప్రజలకు సాయం
మరోవైపు, రెబల్ ఎమ్మెల్యేలు అసోం వరద సహాయక కార్యక్రమాల కోసం రూ.51 లక్షలు అందించారు. రాష్ట్రవ్యాప్తంగా వరదలు ముంచెత్తుతుంటే రెబల్స్.. లగ్జరీ హోటల్లో ఉంటున్నారన్న విమర్శల నేపథ్యంలో డొనేషన్ అందించారు. 'అసోం సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.51 లక్షలను శిందే అందించారు. ప్రస్తుతం కొనసాగుతున్న సహాయక చర్యలకు మావంతు భాగస్వామ్యం అందించాలని ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇక్కడి ప్రజల కష్టాలను పట్టించుకోకుండా ఉండలేము' అని రెబల్ క్యాంపు ఎమ్మెల్యే ఒకరు చెప్పుకొచ్చారు.
పేర్ల మార్పు...
కాగా, బుధవారం సాయంత్రం కేబినెట్ సమావేశం నిర్వహించిన సీఎం ఠాక్రే.. పలు ప్రాంతాల పేర్లను మార్చుతూ నిర్ణయం తీసుకున్నారు. ఔరంగాబాద్‌ను సంభాజీ నగర్‌గా, ఒస్మానాబాద్‌ను ధారాశివ్‌గా, నవీ ముంబయి ఎయిర్‌పోర్ట్‌ను డీపీ పాటిల్ అంతర్జాతీయ విమానాశ్రయంగా పేర్లు మార్చేందుకు కేబినెట్ అంగీకారం తెలిపింది.
'మాకు అనుమతివ్వండి...'
జైల్లో ఉన్న ఎన్సీపీ మంత్రులు నవాబ్ మాలిక్, అనిల్ దేశ్‌ముఖ్‌లకు బలపరీక్షలో ఓటేసే అవకాశం కల్పించింది సుప్రీంకోర్టు. అసెంబ్లీలో నిర్వహించే బలపరీక్షలో పాల్గొనేలా తమను అనుమతించాలని కోరుతూ వీరిరువురూ దాఖలు చేసిన పిటిషన్‌కు అనుకూలంగా తీర్పు చెప్పింది. మనీలాండరింగ్ కేసుల్లో వీరిద్దరూ ప్రస్తుతం జైల్లో ఉన్నారు. ఈడీ, సీబీఐ జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న నేపథ్యంలో వీరిని ఆయా ఏజెన్సీలు అసెంబ్లీకి తీసుకురావాలని ఆదేశించింది.
ఇదీ చదవండి: