Eknath Shinde CM oath today: మహారాష్ట్ర రాజకీయాల్లో భారీ ట్విస్ట్! ఉద్ధవ్ ఠాక్రే సర్కారును కుప్పకూల్చిన రెబల్ నేత ఏక్నాథ్ శిందే.. ముఖ్యమంత్రి పదవి దక్కించుకున్నారు. రాత్రి ఏడున్నర గంటలకు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఉద్ధవ్ ఠాక్రే రాజీనామాతో రాష్ట్రంలో సర్కారు కుప్పకూలగా.. ఏక్నాథ్ శిందే వర్గం, భాజపా కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవకాశం లభించింది.
ఈ నేపథ్యంలోనే శివసేన రెబల్ నేత ఏక్నాథ్ శిందేతో కలిసి గవర్నర్‌ను కలిశారు మాజీ సీఎం దేవేంద్ర ఫడణవీస్. ఆయనే ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారని అంతా భావించారు. శిందేకు ఉప ముఖ్యమంత్రి పదవి లభిస్తుందని అంచనా వేశారు. అయితే, శిందేకు ఏకంగా సీఎం పదవిని అప్పగిస్తూ సంచలన ప్రకటన చేశారు ఫడణవీస్. తాను ప్రభుత్వానికి దూరంగా ఉండనున్నట్లు మరో సంచలన వార్త చెప్పారు.
నడ్డా అభ్యర్థనతో...
అయితే, భాజపా జాతీయ నాయకత్వం కల్పించుకొని ఉప ముఖ్యమంత్రిగా ఫడణవీస్ కొనసాగేలా చర్యలు తీసుకుంది. 'ఫడణవీస్ ప్రభుత్వంలోనే ఉండాలని భాజపా నాయకత్వం నిర్ణయించింది. వ్యక్తిగతంగా ఫడణవీస్‌ను సంప్రదించి ఒప్పించాం. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోవాలని కోరాం' అని భాజపా జాతీయ అధ్యక్షుడు నడ్డా తెలిపారు.
ఇదీ చదవండి: కింగ్ మేకర్ కాదు.. 'కింగ్'! రిక్షావాలా టు మహా 'సీఎం'.. ఎవరీ శిందే?
'అందుకే ఎమ్మెల్యేల తిరుగుబాటు'
అంతకుముందు మీడియా సమావేశంలో మాట్లాడారు ఫడణవీస్. శివసేన హిందుత్వానికి దూరమైందని అన్నారు. 'ప్రమాణస్వీకారం తర్వాత కేబినెట్ విస్తరణ ఉంటుంది. శివసేన, భాజపా నేతలు ప్రమాణస్వీకారం చేస్తారు. 2019లో భాజపా, శివసేన కూటమికి ప్రజలు అధికారం అప్పగించారు. కానీ, శివసేన మాత్రం బాలాసాహెబ్ తన జీవితాంతం వ్యతిరేకించిన వారితోనే కూటమి ఏర్పాటు చేసుకుంది. హిందుత్వ, సావార్కర్‌కు వ్యతిరేకులైన వారితో కలిసింది. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని అవమానించింది. అందుకే కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి నుంచి దూరం జరగాలని శివసేన (రెబల్) ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. కానీ ఠాక్రే వాటిని పట్టించుకోలేదు. అఘాడీ కూటమికే ప్రాధాన్యం ఇచ్చారు. అందుకే, సేన ఎమ్మెల్యేలు తమ గళాన్ని గట్టిగా వినిపించాలనుకున్నారు' అని ఫడణవీస్ వివరించారు.
అనంతరం మాట్లాడిన ఏక్నాథ్ శిందే.. తనతో వచ్చిన ఎమ్మెల్యేలకు ఎలాంటి సమస్య కలగకుండా చూసుకుంటానని స్పష్టం చేశారు. 'బాలాసాహెబ్ హిందుత్వ విధానానికి కట్టుబడి, మా నియోజకవర్గాల అభివృద్ధి కోసం మేం ఈ నిర్ణయం తీసుకున్నాం. మా నియోజకవర్గాల్లో ఎలాంటి పురోగతి లేకపోతే ఎన్నికల్లో కష్టమనే భావనతోనే.. ఠాక్రేతో మాట్లాడాం. భాజపాతో తమకు ఉన్న కూటమిని పునరుద్ధరించాలని డిమాండ్ చేశాం. ప్రస్తుతం 50 మంది ఎమ్మెల్యేలు మాతో ఉన్నారు. ఇందులో 40 మంది శివసేన శాసనసభ్యులు. వీరి సాయంతోనే ఇంతకాలం పోరాటం చేయగలిగాం. వీరి నమ్మకాన్ని వమ్ము చేయడం అటుంచితే.. వారి విశ్వాసానికి కాస్త కూడా విఘాతం కలగజేయను' అని శిందే చెప్పారు. ఫడణవీస్ ముఖ్యమంత్రి పదవిని స్వీకరించకున్నా.. ఆయనకు కృతజ్ఞతలు చెబుతున్నట్లు పేర్కొన్నారు శిందే. బాలాసాహెబ్ సైనికుడిని రాష్ట్ర ముఖ్యమంత్రిని చేశారని.. ఈ ఘనత ప్రధాని మోదీ, అమిత్ షా, ఇతర భాజపా నేతలదేనని అన్నారు.
ఇదీ చదవండి: