మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఎన్సీపీ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుత పరిస్థితులను దేశ్‌ముఖ్.. ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌కు వివరించినట్లు పేర్కొన్నాయి. దేశ్‌ముఖ్‌పై వచ్చిన అవినీతి ఆరోపణలపై సీబీఐ విచారణ జరపాలన్న హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో పదవిలో ఉండటం సబబు కాదని దేశ్‌ముఖ్ భావించినట్లు మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ తెలిపారు. ఆయనపై ముంబయి మాజీ పోలీస్ కమిషనర్ పరమ్‌వీర్ సింగ్ చేసిన ఆరోపణలపై దర్యాప్తు చేయాలంటూ బాంబే హైకోర్టు సీబీఐని ఆదేశించిన నేపథ్యంలో దేశ్‌ముఖ్ తన పదవికి రాజీనామా చేసినట్లు సమాచారం. రాజీనామా లేఖను అనిల్ దేశ్‌ముఖ్ ట్విటర్‌లో పోస్ట్ చేశారు.
హైకోర్టు ఆదేశంతో..
అంతకుముందు.. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న హోం మంత్రి అనిల్ దేశ్ ముఖ్ పై సీబీఐ దర్యాప్తునకు బొంబాయి హైకోర్టు ఆదేశించింది. ముంబయి పోలీస్ మాజీ కమిషనర్ పరంబీర్ సింగ్ చేసిన ఆరోపణలపై దాఖలైన పిటిషన్లపై బాంబే హైకోర్టు విచారణ జరిపింది. హోంమంత్రిపై ఇలాంటి ఆరోపణలు రావడం అసాధారణం, అనూహ్యమని కోర్టు వ్యాఖ్యానించింది. ఈ కేసులో స్వతంత్ర విచారణ అవసరమన్న కోర్టు.. దేశ్‌ముఖ్‌పై వచ్చిన ఆరోపణలపై సీబీఐ 15రోజుల్లో ప్రాథమిక విచారణ పూర్తి చేయాలని ఆదేశించింది. దర్యాప్తులో ఆధారాలు లభిస్తే ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయాలని పేర్కొంది. ప్రాథమిక విచారణ పూర్తయిన తర్వాత దీనిపై తదుపరి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. బాంబే హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించిన నేపథ్యంలో అనిల్ దేశ్‌ముఖ్ రాజీనామా సమర్పించారు.
ఆ లేఖతో కలకలం
ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ ఇంటి ముందు పేలుడు పదార్థాల వాహనం కేసులో పోలీసు అధికారి సచిన్‌వాజే అరెస్టు తర్వాత అప్పటి ముంబయి కమిషనర్ పరంవీర్‌ను హోంగార్డ్ డీజీగా బదిలీ చేశారు. బదిలీ అనంతరం పరంవీర్ సంచలన ఆరోపణలు చేశారు. హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ ప్రతి నెలా 100కోట్ల రూపాయల వసూళ్లను వాజేకు లక్ష్యంగా పెట్టారంటూ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు లేఖ రాశారు. మరోవైపు పేలుడు పదార్థాల వాహనం కేసులో ఎన్‌ఐఏ దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఇటీవల దక్షిణ ముంబయిలోని ఓ క్లబ్‌లో జరిపిన సోదాల్లో ఎన్‌ఐఏ కీలక పత్రాలు స్వాధీనం చేసుకుంది. ఆ పత్రాల్లో క్లబ్ నెలవారీగా ప్రభుత్వ అధికారులకు ఇచ్చిన సొమ్ము వివరాలు ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు, ఇతర అధికారులకు ఇచ్చిన లంచాలు, వారి పేర్లతో సహా ఉన్నట్లు సమాచారం. వీటిని దర్యాప్తు సంస్థ క్షుణ్ణంగా పరిశీలిస్తోంది.
'ఠాక్రేకు పాలించే అధికారం లేదు'
దేశ్‌ముఖ్ రాజీనామా అనంతరం మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేపై విమర్శలు గుప్పించింది భాజపా. దేశ్‌ముఖ్ రాష్ట్ర హోంమంత్రి పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో.. ఠాక్రే పాలించే నైతిక బాధ్యతను కోల్పోయారని భాజపా సీనియర్ నేత, కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్నారు. ఈ ప్రభుత్వ హాయంలో ఎన్నో దారుణాలు జరిగాయని ఆరోపించారు.