మహారాష్ట్రలో మహావికాస్ అఘాడీ ప్రభుత్వం అధికారంలో కొనసాగేందుకు నైతిక అర్హత కోల్పోయిందని ధ్వజమెత్తారు ఆ రాష్ట్ర విపక్ష నేత దేవేంద్ర ఫడణవీస్. ఈ విషయమై సహచర భాజపా నేతలతో కలిసి గవర్నర్‌ను కలిసి మెమొరాండం సమర్పించారు.
రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే నోరు మెదపడం లేదని విమర్శించారు ఫడణవీస్.
"ఇన్ని పరిణామాలు జరిగినా.. ముఖ్యమంత్రి మౌనంగా ఉన్నారు. రెండుసార్లు పత్రికా సమావేశాలు నిర్వహించిన శరద్ పవార్.. హోంమంత్రిని వెనకేసుకొచ్చేందుకే ప్రయత్నించారు. మహావికాస్ అఘాడీ ప్రభుత్వం అధికారంలో ఉండేందుకు నైతికంగా అర్హత కోల్పోయింది. ముఖ్యమంత్రి ఏం మాట్లాడటం లేదంటే రాష్ట్రానికి అధిపతిగా గవర్నరే సీఎంను సంప్రదించాలి. అన్ని సమస్యలపై నివేదిక అందించాలని సీఎంను ఆదేశించాలి."
-దేవేంద్ర ఫడణవీస్, భాజపా నేత
అవినీతి ఆరోపణలతో పాటు అధికారుల బదిలీ అంశంపైనా దర్యాప్తు జరగాలని ఫడణవీస్ డిమాండ్ చేశారు. బదిలీ రాకెట్‌ను వెలుగులోకి తీసుకొచ్చినవారికి శిక్ష పడిందని, కానీ అక్రమాలకు పాల్పడ్డవారి గురించి చర్చ జరగడం లేదన్నారు. లంచం తీసుకున్న డబ్బుల్లో ఎక్కువ వాటా వస్తోంది కాబట్టే కాంగ్రెస్ పార్టీ ఈ విషయంపై మౌనంగా ఉందేమోనని ఎద్దేవా చేశారు.
'అస్థిరత కోసమే భాజపా యత్నం'
భాజపా తీరును శివసేన తీవ్రంగా తప్పుబట్టింది. రాష్ట్రపతి పాలన విధించి మహారాష్ట్రను అస్థిరపరచడమే ఆ పార్టీ ఉద్దేశమని వ్యాఖ్యానించింది. భాజపా, కొంతమంది అధికారులు కలిసి రాష్ట్ర ప్రభుత్వాన్ని బలహీనపరిచేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించింది.
రాష్ట్ర ప్రభుత్వంపై అనుమానాలు కలిగించేందుకే కొందరు అధికారులు తమ లేఖలను మీడియాకు విడుదల చేస్తున్నారని పేర్కొంది శివసేన. ఫడణవీస్ వద్ద ఉన్న ఫోన్ ట్యాపింగ్ నివేదికలను.. సుబోధ్ జైస్వాల్, రష్మి శుక్లా వంటి సీనియర్ అధికారులు తయారు చేశారని చెప్పింది. ప్రభుత్వంలోని కొంతమంది ఓ రాజకీయ పార్టీ తరఫున పనిచేస్తున్నారని ఈ విషయాన్ని బట్టి అర్థమవుతోందని పేర్కొంది..
6.3 జీబీల డేటా
మహారాష్ట్ర పోలీసు విభాగంలోని ఐపీఎస్, నాన్ ఐపీఎస్‌ల బదిలీల్లో అవకతవకలు ఉన్నాయని భాజపా ఆరోపిస్తోంది. ఇందుకు సంబంధించిన ఆధారాలను కేంద్ర హోంశాఖ కార్యదర్శికి మంగళవారం అందించారు ఫడణవీస్. కాల్ రికార్డింగ్‌లు, పత్రాలు అన్నీ కలిసి 6.3 జీబీల డేటా తన వద్ద ఉందని ఆయన తెలిపారు.
ఇవీ చదవండి: