మహారాష్ట్రలోని గడ్చిరోలీ అటవీ ప్రాంతం మరోసారి తుపాకీ కాల్పులతో దద్దరిల్లింది. ఎటపల్లి పరిధిలోని కొట్మీ అడవుల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో నక్సలైట్లకు తీవ్రనష్టం వాటిల్లింది. కమాండోల కాల్పుల్లో 13 మంది నక్సల్స్ హతమైనట్లు స్థానిక పోలీసులు తెలిపారు. గతనెల.. ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా-బీజాపూర్ సరిహద్దుల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో 22మంది భద్రతాదళాలు చనిపోయిన తర్వాత నక్సల్స్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
శుక్రవారం ఉదయం 5:30 గంటల ప్రాంతంలో ఎదురుకాల్పుల ఘటన జరిగినట్టు గడ్చిరోలీ డీఐజీ సందీప్ పాటిల్ తెలిపారు. కొట్మీ అటవీ ప్రాంతంలో నక్సల్స్ సమావేశమయ్యారన్న పక్కా సమాచారంతో.. సీ-60 కమాండోలు కూంబింగ్ ప్రారంభించినట్లు చెప్పారు. వారికి తారసపడిన నక్సల్స్.. కాల్పులకు దిగగా.. అప్రమత్తమైన కమాండోలు ఎదురుకాల్పులకు దిగారన్నారు. ఈ ఘటనలో 13 మంది నక్సల్స్ చనిపోయినట్లు ఆయన పేర్కొన్నారు. సుమారు గంటసేపు ఇరువైపులా భీకరంగా కాల్పులు జరిగినట్టు సమాచారం.
కమాండోల వైపు నుంచి తీవ్రమైన ప్రతిఘటన ఎదురుకావటం వల్ల.. మిగిలిన నక్సల్స్ బృందం అడవిలోకి పారిపోయినట్లు ఎస్పీ అంకిత్ గోయల్ తెలిపారు. వారికోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు తెలిపారు. కాల్పులు జరిగిన ప్రాంతం నుంచి నక్సల్స్ మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని ఆయన స్పష్టం చేశారు. పోస్ట్ మార్టం అనంతరం.. ఆయా మృతదేహాలను వారి బంధువులకు అప్పగిస్తామని చెప్పారు.
ఇదీ చదవండి: జమ్ములో ఉగ్రవాది అరెస్ట్-3 గ్రెనేడ్లు స్వాధీనం