Uddhav Thackeray Resigns: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే.. తన పదవికి రాజీనామా చేశారు. మహారాష్ట్ర అసెంబ్లీలో గురువారం బలపరీక్ష జరగాల్సిందేనని సుప్రీం కోర్టు తీర్పు వెలువరించిన క్షణాల్లోనే తన రాజీనామా ప్రకటించారు ఠాక్రే. ఫేస్బుక్ లైవ్‌లో మాట్లాడిన ఉద్ధవ్.. తన నిర్ణయాన్ని వెలువరించారు. ఎమ్మెల్సీ పదవికి సైతం రాజీనామా చేస్తున్నట్లు స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా.. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్‌కు కృతజ్ఞతలు తెలిపారు. రిక్షావాలాను మంత్రిని చేస్తే.. ఆయనే తనకు ద్రోహం చేశారంటూ పరోక్షంగా ఏక్‌నాథ్ శిందేను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తున్నట్లు ప్రకటించిన ఠాక్రే.. ప్రజాస్వామ్య విధానాలను కూడా అనుసరించాలని కోరారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలు తమతో మాట్లాడాలని మరోసారి సూచించారు.
''సోనియా గాంధీ, శరద్ పవార్‌కు కృతజ్ఞతలు. బాలాసాహెబ్ ఆశయాలు నెరవేర్చాం. మా ప్రభుత్వానికి కొందరి దిష్టి తగిలింది. ఆ దిష్టి ఎవరిదో అందరికీ తెలుసు. సుప్రీం కోర్టు తీర్పును గౌరవిస్తున్నాం. ఔరంగాబాద్ పేరును మార్చాం. రెబల్ ఎమ్మెల్యేలు మాతో మాట్లాడాల్సింది. మా పార్టీ వాళ్లే మమ్మల్ని మోసం చేశారు.''
- ఉద్ధవ్ ఠాక్రే
2019 అసెంబ్లీ ఎన్నికల్లో భాజపాతో కలిసి పోటీచేసిన శివసేన.. ముఖ్యమంత్రి పదవి కోసం పట్టుబట్టి కాషాయదళంతో తెగదెంపులు చేసుకుంది. తర్వాత ఎన్సీపీ, కాంగ్రెస్‌తో కలిసి 2019 నవంబర్ 26న మహావికాస్ అఘాడీ కూటమికి ఉద్ధవ్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 28న ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తర్వాత ఎన్సీపీ, భాజపా కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసినప్పటికీ కొద్దిరోజుల్లోనే పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. తిరిగి ఉద్ధవ్ ఠాక్రే మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. తదనంతర పరిణామాల్లో ఎదురైన సంక్షోభాలను... ఎన్సీపీ అధినేత శరద్ పవార్ పరిష్కరిస్తూ వచ్చారు.
పార్టీని చీల్చిన శిందే
అయితే ఇటీవల శివసేనలో అంతర్గత కుమ్ములాటలు ఒక్కసారిగా రచ్చకెక్కాయి. ఈనెల 20న జరిగిన శాసనమండలి ఎన్నికల్లో భాజపా అనూహ్యంగా ఐదు సీట్లు గెల్చుకుంది. నాలుగు సీట్లు గెల్చేందుకు మాత్రమే ఆ పార్టీకి బలం ఉండగా ఐదు సీట్లు దక్కించుకోవడంపై శివసేనలో అంతర్మథనం మొదలైంది. పార్టీ ఎమ్మెల్యేలు కొందరు భాజపాకు ఓటువేసినట్లు గుర్తించారు. ఫలితాలు వచ్చిన వెంటనే శివసేన సీనియర్ నేత ఏక్‌నాథ్ శిందే అదృశ్యమయ్యారు. తర్వాత శివసేన ప్రభుత్వంపై తిరుగుబావుటా ఎగురవేశారు.
ఈ క్రమంలో శివసేనకు మొత్తం 55 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. సుమారు 40 మంది శిందే వర్గంలో చేరిపోయారు. పలువురు స్వతంత్రులు కూడా.. శిందేకు మద్దతు ప్రకటించారు. వారంతా అసోంలోని గువాహటిలో మకాం వేసి సంకీర్ణ సర్కారుకు సవాలు విసిరారు. ఫలితంగా...ఎంవీఏ సర్కారు మైనార్టీలో పడిపోయింది. తిరుగుబాటు ఎమ్మెల్యేలు తిరిగి వస్తే.. సంకీర్ణ సర్కారు నుంచి వైదొలిగేందుకు కూడా సిద్ధమని ఉద్ధవ్ ఠాక్రే వర్గం కోరినా.. శిందే శిబిరంలో మార్పు రాలేదు.
భాజపా సంబరాలు
మరోవైపు భాజపాకు చెందిన మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్.. మంగళవారం ఒక్కసారిగా చక్రం తిప్పారు. మొదట దిల్లీలో భాజపా అగ్రనేతలు అమిత్ షా, జేపీ నడ్డాతో చర్చలు జరిపిన ఆయన.. రాత్రికి ముంబయి చేరుకొని గవర్నర్‌తో సమావేశమయ్యారు. కొద్దిసేపటికే అసెంబ్లీలో గురువారం బలనిరూపణ చేసుకోవాలంటూ.. ఉద్ధవ్ ఠాక్రేకు గవర్నర్ లేఖ రాశారు. దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్లినా ఫలితం లేకపోవడం వల్ల... ఠాక్రే సీఎం పదవికి రాజీనామా చేశారు. ఫలితంగా మహావికాస్ అఘాడీ ప్రభుత్వం 32 నెలల్లోనే కూలిపోయింది. ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా ప్రకటన చేసిన వెంటనే భాజపా శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. ముంబయిలోని ఒక హోటల్‌లో సమావేశమైన భాజపా ఎమ్మెల్యేలు మిఠాయిలు పంచుకున్నారు.
ఇదీ చదవండి: ఠాక్రే సర్కారుకు చుక్కెదురు.. గురువారం బలపరీక్ష జరగాల్సిందేనన్న సుప్రీం