అనేక మంది ఒకే ట్రాక్టర్‌కు రెండు ట్రాలీలను బిగించి తీసుకెళ్తుంటారు. ఫలితంగా కొన్నిసార్లు రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. దీనికి పరిష్కారం చూపించాలనే లక్ష్యంతో రెండు ట్రాలీల బరువును ఒకేసారి మోయగలిగే ట్రాలీని రూపొందించాడు ఓ యువకుడు. అతడి ఆవిష్కరణకు గాను స్టార్టప్ యాత్రలో ఓ బహుమతిని సైతం గెలుచుకున్నాడు.
సాధారణంగా ట్రాలీని ట్రాక్టర్‌తో అనుసంధానిస్తే సుమారు 25 టన్నుల బరువును మోస్తుంది. కానీ అక్షయ్ తయారు చేసిన నాలుగు చక్రాల ట్రాలీ మాత్రం 40 టన్నులు బరువును మోసుకెళ్తుంది. మహారాష్ట్ర ఔరంగాబాద్ జిల్లాలోని దొంగావ్కు గ్రామానికి చెందిన అక్షయ్ చావన్ ఇంటర్ వరకు చదువుకున్నాడు. కుటుంబ ఆర్థిక పరిస్థితుల దృష్టా చదువు మధ్యలోనే మానేసి ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. తన ట్రాలీ 25 టన్నుల బరువును మించి మోసేది కాదు. ఈ సమస్యకు ఎలాగైనా చెక్ పెట్టాలనుకుని.. సెల్ఫ్ డ్రైవ్ ట్రాలీని రూపొందించాడు. ఇది తక్కువ ఇంధనంతో ఎక్కువ బరువును మోస్తుందని చెబుతున్నాడు అక్షయ్.
ట్రాక్టర్ ఉత్పత్తి చేసే శక్తి ట్రాలీకి అందుతుంది. దీని వల్ల మరింత బరువును సులువుగా మోయగలుగుతుంది. ట్రాలీ బ్రేక్స్‌ను ట్రాక్టర్ బ్రేక్స్‌తో అనుసంధానించాను. సాధారణంగా ట్రాలీలో ఈ సదుపాయం ఉండదు. రెండు ట్రాలీలతో మోసే బరువును ఈ ఒక్క ట్రాలీ మోయగలదు. ఇది ఎక్కువ బరువును మోయడమే కాకుండా తక్కువ ఇంధనాన్ని వినియోగించుకుంటుంది.
--అక్షయ్ చావన్, ట్రాలీ రూపకర్త
ఈ వాహనాన్ని రూపొందించడానికి చాలా కష్టపడ్డానని.. ఎవరూ ఆర్థిక సహాయం చేయకపోవడం వల్ల రూ.5 లక్షల అప్పు చేశానని చెప్పాడు. దీనికి పేటెంట్ తీసుకుని మార్కెట్లోకి విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నానని తెలిపాడు. మహారాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన 'స్టార్టర్ యాత్ర'లో బహుమతిని సైతం గెలుచుకున్నాడు చావన్. తన లాంటి నైపుణ్యం కలిగిన యువతకు ప్రభుత్వం సహకారం అందించాలని విజ్ఞప్తి చేస్తున్నాడు.
ఇవీ చదవండి: మహిళను చెంప దెబ్బ కొట్టిన మంత్రి.. భూమి గురించి అడిగినందుకు..
రెండేళ్ల చిన్నారి గొప్ప మనసు.. క్యాన్సర్ రోగుల కోసం జుట్టు దానం..