Chemist Murder: రాజస్థాన్ ఉదయ్‌పుర్ తరహా ఘటన.. మహారాష్ట్ర అమరావతిలో జరిగింది. భాజపా మాజీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మకు మద్దతుగా వాట్సాప్ గ్రూప్‌లో పోస్టును ఫార్వర్డ్ చేసిన ఓ మెడికల్ షాపు యజమానిని(కెమిస్ట్) దుండగులు దారుణంగా చంపారు. గత నెల 21న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రాగా ఆధారాలు సహా కీలక నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. మరోవైపు ఉదయ్‌పుర్ తరహాలోనే ఈ కేసును కూడా కేంద్ర ప్రభుత్వం ఎన్ఐఏకు అప్పగించింది.
రాజస్థాన్ ఉదయ్‌పుర్‌లో కన్హయ్య లాల్ హత్యకు వారం రోజుల ముందే కెమిస్ట్ ప్రహ్లాద్ రావు హత్య జరిగింది. ఈ కేసులో అసలు నిందితుడు ఇర్ఫాన్ ఖాన్ కోసం గాలింపు కొనసాగుతున్నట్లు అమరావతి పోలీస్ కమిషనర్ ఆర్తి సింగ్ తెలిపారు. నిందితుడు ఇర్ఫాన్ ఖాన్ ఓ స్వచ్ఛంద సంస్థను నడుపుతున్నట్లు వెల్లడించారు. నుపుర్ శర్మకు మద్దతుగా ఉన్న ఓ పోస్టును ప్రహ్లాద్ రావు పొరపాటున ఓ వాట్సాప్ గ్రూప్‌లో ఫార్వర్డ్ చేశాడని పోలీసు వర్గాలు తెలిపాయి. ఆ వాట్సాప్ గ్రూప్‌లో కొందరు ముస్లింలు కూడా ఉన్నట్లు వెల్లడించారు. ఈ ఘటన తర్వాత ఇర్ఫాన్ ఖాన్ ప్రహ్లాద్‌రావు హత్యకు కుట్ర పన్నాడని పోలీసు వర్గాలు వివరించాయి. ఇందుకు ఐదుగురు వ్యక్తులను నియమించి, వారికి పదివేలు ఇస్తానని ఇర్ఫాన్ చెప్పాడని వెల్లడించారు. హత్య తర్వాత కారులో పారిపోయేందుకు కూడా ఏర్పాట్లు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Chemist Murder Nupur Sharma: ప్రహ్లాద్‌రావు జూన్ 21 రాత్రి తన ఔషధ దుకాణాన్ని మూసివేసి ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళుతుండగా దుండగులు హత్య చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. ప్రహ్లాద్‌రావు భార్య, కుమారుడు మరో వాహనంపై ఆయన వెంటే వెళుతున్నారని తెలిపారు. ఆ సమయంలో రెండు మోటారుసైకిళ్లపై దుండుగులు రాగా వారిలో ఒకడు పదునైన కత్తితో ప్రహ్లాద్‌రావు మెడపై నరికాడని వివరించారు. తర్వాత దుండగులు పరారవ్వగా బాధితుడి కుమారుడు ఆస్పత్రికి తరలించాడు. అక్కడ ప్రహ్లాద్‌రావు చనిపోయినట్లు పోలీసులు వివరించారు. ప్రహ్లాద్‌రావు కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు ఐదుగురు దుండగులను అరెస్టు చేశారు. వారంతా రోజూవారీ కూలీలు అని వివరించారు. హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. సీసీటీవీ దృశ్యాల ద్వారా ఈ ఘటన పూర్వాపరాలను విశ్లేషించారు. అయితే అసలు నిందితుడు ఇంకా దొరకనందున హత్యకు కారణాలు తెలియలేదని పోలీసు కమిషనర్ చెప్పారు.
ఇవీ చదవండి: ఆ ప్రమాదం సమీపంలో విరిగిపడిన మరో కొండచరియ.. 24కు చేరిన మృతులు!