Maganti Annapurna Devi gandhiji: 1921 మార్చిలో విజయవాడ వచ్చారు గాంధీజీ. ఈ సందర్భంగా జాతీయోద్యమం కోసం ఎవరికి తోచిన విధంగా వారు చందాలిచ్చారు. ఓ మహిళ మాత్రం... మెడలోని మంగళసూత్రం తప్ప.. ఒంటిమీదున్న 200 కాసుల బంగారు ఆభరణాలను అప్పటికప్పుడు తీసి గాంధీజీ చేతిలో పెట్టారు. ఆవేశంతోనో, తాత్కాలిక ఉత్సాహంతోనో చేసిన పని కాదది. స్పృహతో... స్వాతంత్య్రోద్యమ స్ఫూర్తితో... పూర్తి అంకితభావంతో అన్నపూర్ణాదేవి ఆ పనిచేశారని తెలుసుకున్న గాంధీజీ ఆమెను అభినందించారు. అదే సంవత్సరం ఏప్రిల్‌లో అన్నపూర్ణాదేవి ఆహ్వానిస్తే... ప్రత్యేకంగా ఏలూరుకు వచ్చారాయన.
Maganti Annapurna Devi biography
1900 సంవత్సరం మార్చి 3న చాటపర్రులో బ్రహ్మసమాజ అనుయాయులైన కలగర రామస్వామి, పిచ్చమ్మ దంపతులకు జన్మించిన అన్నపూర్ణాదేవి ప్రాథమిక విద్యాభ్యాసం ఏలూరు, గుంటూరుల్లో జరిగింది. తర్వాత కోల్‌కతా బ్రహ్మబాలికా విద్యాలయానికి మారారు. ఇంటర్మీడియెట్ దాకా అక్కడే చదువుకున్న ఆమె... 16ఏళ్ల వయసులోనే పిల్లల పుస్తకం రాశారు. అరవిందుని లేఖలను బెంగాలీ నుంచి తెలుగులోకి అనువదించారు. 1920లో మాగంటి బాపినీడుతో వివాహమైన తర్వాత... భర్తతో పాటు విదేశాలకు వెళ్లాల్సి వచ్చింది. కానీ... గాంధీజీ రాకతో ఆమె తన ఆలోచనలను మార్చుకున్నారు. విదేశీ వస్త్రాలను వదిలేసి... ఖద్దరు ధరించారు. తన విదేశీ ప్రయాణాన్ని విరమించుకొని... స్వదేశీ సమరంలో క్రియాశీలకం కావాలని నిశ్చయించుకున్నారు. సహాయ నిరాకరణోద్యమంలో భాగంగా ఆంధ్రదేశమంతటా పర్యటిస్తూ... యువతరంలో ఉత్సాహాన్ని రగిలించారు. ప్రజల విరాళాలతో ఏలూరులో 1923లో మోహన్‌దాస్ ఖాదీ పరిశ్రమాలయాన్ని స్థాపించారు.
Azadi ka Amrit Mahotsav:
ఇద్దరు దళిత పిల్లల పోషణభారం స్వీకరించి... తన ఇంట్లోనే ఉంచుకొని సొంతపిల్లల్లా చూసుకున్నారు. ఫలితంగా తనను సంఘ బహిష్కరణ చేసినా... చలించకుండా నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడ్డ ధీశాలి అన్నపూర్ణమ్మ.
1923లో భర్త బాపినీడు విదేశాల నుంచి తిరిగి వచ్చారు. ఓడ వద్దకు స్వయంగా వెళ్లిన ఆమె... భర్త దిగగానే విదేశీ సూటు, బూటు... హ్యాటులను అప్పటికప్పుడు సముద్రంలో పారేయించి, ఖద్దరు దుస్తులు ధరింపజేశారు. ఆయనకూ స్వదేశీ దీక్షనిచ్చారు. అలా భర్తకు రాజకీయ మార్గదర్శి అయ్యారు. 1924లో మగబిడ్డ పుట్టి చనిపోయాక...ఆమె ఆరోగ్యం దెబ్బతింది. అయినా ఉద్యమస్ఫూర్తిని అలాగే కొనసాగించారు. రామకృష్ణ పరమహంస ‘లీలామృతం’ను బెంగాలీ నుంచి ఆంధ్రీకరించారు. 1927లో ఝాన్సీలక్ష్మికి జన్మనిచ్చిన అన్నపూర్ణమ్మ... అనారోగ్యంపాలై... అదే ఏడాది అక్టోబరు 9న తన 27వ ఏటనే కన్నుమూశారు.
"నాకు గుర్తున్నంత వరకు తనకున్న బంగారు నగలన్నింటినీ దేశం కోసం సమర్పించిన తొలి భారతీయ మహిళ అన్నపూర్ణ. ఈ దేశంలో నన్ను తండ్రిగా స్వీకరించిన అనేకమంది పుత్రికల్లో అన్నపూర్ణ అత్యుత్తమురాలు. ఆమె మరణంతో ఓ దేశభక్తురాలిని మాత్రమే కాదు... నా పుత్రికను కోల్పోయాను’’ అంటూ గాంధీజీ శ్రద్ధాంజలి ఘటించారు.
- రామోజీ విజ్ఞాన కేంద్రం
ఇదీ చదవండి: