Madras HC Whatsapp Admin: వాట్సాప్ గ్రూపుల్లో సభ్యులు చేసిన వివాదాస్పద, అపఖ్యాతి కలిగించే వ్యాఖ్యలకు అడ్మిన్‌ను బాధ్యులను చేయకూడదని మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ స్పష్టం చేసింది. సభ్యులు పోస్ట్ చేసిన మెసేజ్‌లను ఎడిట్ చేయడం, ఆడిట్ చేయడం అడ్మిన్ బాధ్యత కాదని తేల్చి చెప్పింది. అయితే, సభ్యుల సందేశాలను పరిశీలిస్తూ ఉండాలని సూచించింది. కరూర్ జిల్లాకు చెందిన రాజేంద్రన్ అనే న్యాయవాది వేసిన పిటిషన్‌పై ఈ మేరకు వ్యాఖ్యానించింది.
Whatsapp admin rights
"వాట్సాప్ గ్రూప్‌లో జరిగే నిరంతర సంభాషణకు అడ్మిన్లను బాధ్యులను చేయకూడదు. సభ్యులు పోస్ట్ చేసిన సందేశాలను మార్చడం, ఆడిట్ చేయడం కూడా అడ్మిన్ల బాధ్యత కాదు. బాంబే హైకోర్టు తీర్పులోనూ ఇదే విషయం ఉంది. వివాదాస్పద పోస్టుకు సంబంధం లేకపోతే పిటిషనర్ పేరును పోలీస్ కేసు నుంచి తొలగించవచ్చు."
-జస్టిస్ జీఆర్ స్వామినాథన్, మధురై బెంచ్ న్యాయమూర్తి
ఇదీ కేసు..
న్యాయవాది అయిన రాజేంద్రన్.. 'కరూర్ లాయర్స్' పేరుతో వాట్సాప్ గ్రూప్‌ను క్రియేట్ చేశారు. దానికి ఆయనే అడ్మిన్. ఈ గ్రూప్ సభ్యుల్లో ఒకరు వివాదాస్పద, మతపరమైన పోస్టులను తరచుగా పోస్ట్ చేసేవారు. ఇందుకు సంబంధించి ఓ వివాదం పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. గ్రూప్ అడ్మిన్ రాజేంద్రన్పైనా కేసు నమోదు చేశారు పోలీసులు. దీంతో కేసులో నుంచి తన పేరును తొలగించాలని మధురై బెంచ్‌ను ఆశ్రయించారు రాజేంద్రన్. వివాదాస్పద వ్యాఖ్యల గురించి తెలియగానే.. ఆ మెంబర్‌ను గ్రూప్ నుంచి తొలగించినట్లు కోర్టుకు తెలిపారు.
దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ జీఆర్ స్వామినాథన్.. అడ్మిన్ బాధ్యతలపై ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కేసుపై ఇప్పుడే ముగింపునకు రాలేమని.. ఫోరెన్సిక్ నివేదిక వచ్చిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామని అన్నారు.
ఇదీ చదవండి: వాట్సాప్ గ్రూప్ అడ్మిన్స్‌కు మరిన్ని పవర్స్- ఇక అవి డిలీట్!