luxury car thief arrested: లగ్జరీ కార్లు చోరీ చేస్తూ తెలంగాణ పోలీసులను ముప్పు తిప్పలు పెట్టిన అంతర్రాష్ట్ర దొంగ సత్యేంద్ర సింగ్ శెకావత్ను కర్ణాటక పోలీసులు అరెస్టు చేశారు. బెంగళూరు సహా దేశంలోని పలు ప్రాంతాల్లో ఖరీదైన కార్లను నిందితుడు దొంగలించాడని పోలీసులు తెలిపారు. ఈ దొంగ.. తెలంగాణ పోలీసులకు చిక్కినట్టే చిక్కి తప్పించుకున్నాడని వెల్లడించారు.
లగ్జరీ కార్లే లక్ష్యంగా చేసుకొని సత్యేంద్ర చోరీలకు పాల్పడేవాడు. వందకు పైగా ఖరీదైన కార్లను దొంగలించాడు. డ్రగ్ మాఫియా, మానవ అక్రమ రవాణా ముఠాలకు వీటిని సరఫరా చేసేవాడని పోలీసులు తెలిపారు. ఆటోమెటిక్ కార్లను హ్యాక్ చేసి వాటిని దొంగలిస్తున్నాడని వివరించాడు.
"నిందితుడు గతకొద్ది సంవత్సరాల నుంచి చోరీలకు పాల్పడుతున్నాడు. కన్నడ నిర్మాత మంజునాథ్ గతేడాది హైదరాబాద్లోని బంజారాహిల్స్లో తన కారును పోగొట్టుకున్నాడు. ఈ కేసులో బంజారాహిల్స్ పోలీసులు నిందితుడిని పట్టుకునేందుకు రాజస్థాన్లోని జైపుర్ వరకు వెళ్లారు. 'మీకు సాధ్యమైతే నన్ను పట్టుకోండి' అని వాట్సాప్ ద్వారా పోలీసులకే సవాల్ విసిరాడు."
-కర్ణాటక పోలీసులు
ఈ గజదొంగపై బెంగళూరులో 10 కేసులు నమోదయ్యాయని పోలీసులు తెలిపారు. నిందితుడిని పట్టుకున్న అమృతహళ్లి పోలీసులు.. తదుపరి విచారణను ముమ్మరం చేశారు. నాలుగు విలాసవంతమైన కార్లను స్వాధీనం చేసుకున్నారు.
ఇదీ చదవండి: ప్రైవేటు ట్యూషన్లు చెప్పే ప్రభుత్వ టీచర్లకు హైకోర్టు షాక్