ఉత్తర్‌ప్రదేశ్‌లోని జాన్పుర్లో దారుణం జరిగింది. తన ప్రేమకు అడ్డొస్తున్నారనే కారణంతో ప్రేయసి తల్లీ చెల్లిని హత్యచేసి తన ఇంట్లోనే పూడ్చిపెట్టాడు ఓ కిరాతకుడు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.
ఇదీ జరిగింది..
కొత్వాల్‌లోని కాట్గ్రాలో ఉండే మహాశర్ అనే వ్యక్తికి భార్య, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. అతని పెద్దకూతురు, అదే గ్రామంలో ఉండే పుల్లు అనే యువకుడు ప్రేమించకున్నారు. అయితే ఈ విషయం తెలిసిన ఆమె తల్లి..పెద్దకూతుర్ని.. గాజీపుర్‌లోని బంధువుల ఇంటికి పంపించింది. దాంతో కక్ష పెంచుకున్న పుల్లు.. ప్రేయసికి ఫోన్ చేసి.. ఆమె తల్లిని, చెల్లిని చంపుతానని బెదిరించాడని మహాశర్ తెలిపారు. అనుకున్నట్టుగానే పుల్లు.. ప్రేయసి తల్లిని చెల్లిని హత్యచేసి తన ఇంట్లోనే పూడ్చి పెట్టాడు.
మహాశర్ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుని కోసం గాలిస్తుండగా పుల్లు పోలీసుల కంట పడ్డాడు. అయితే ఓ చిన్నారిని ఎత్తుకుని పారిపోతుండగా పోలీసులు అతన్ని పట్టుకుని అరెస్టు చేశారు. ఆ చిన్నారిని వారి తల్లిదండ్రులకు సురక్షితంగా అప్పగించారు.
కాగా నిందితున్ని లోతుగా ప్రశ్నించగా తల్లీ బిడ్డల్ని చంపింది తానేనని ఒప్పుకున్నాడు. ఆ మృతదేహాల్ని తన ఇంట్లోనే పూడ్చి పెట్టానని తెలిపాడు. దాంతో పోలీసులు అతని ఇంట్లో తవ్వకాలు జరుపగా తల్లీకూతుర్ల శవాలు బయటపడ్డాయి. మృతదేహాల్ని శవపరీక్ష కోసం పంపించారు.
ఇదీ చదవండి: కూతుర్ని చంపి.. తలతో ఠాణాకు!