CM CHANDRABABU Making Tea Video : ఏపీలో ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం లాంఛనంగా ప్రారంభమైంది. దీపం 2.0లో భాగంగా శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం ఈదుపురంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పథకాన్ని ప్రారంభించి, లబ్దిదారులుకు ఉచిత గ్యాస్ సిలిండర్‌ను సీఎం స్వయంగా అందజేశారు. ఈ క్రమంలోనే మహిళా లబ్ధిదారు శాంతమ్మ ఇంటికి వెళ్లి ఉచిత గ్యాస్ సిలిండర్ అందజేయడమే కాకుండా స్వయంగా స్టవ్ వెలిగించి టీ చేసి తాగారు. శాంతమ్మ కుటుంబసభ్యులతో ముఖ్యమంత్రి ముచ్చటించారు.
అనంతరం మరో లబ్ధిదారు ఇంటికి వెళ్లి ఒంటరి మహిళ పింఛను అందజేశారు. ఆ కుటుంబానికి ఇల్లు కట్టించి ఇచ్చే బాధ్యత తమదేనని హామీ ఇచ్చారు. అందుకోసం రేపటి నుంచే పనులు ప్రారంభించాలని జిల్లా కలెక్టర్‌ను ముఖ్యమంత్రి ఆదేశించారు. కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు, రాష్ట్ర మంత్రులు నాదెండ్ల మనోహర్, అచ్చెన్నాయుడు, కొండపల్లి శ్రీనివాస్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
తెలుగు తమ్ముళ్లు, జనసైనికులు రాజీలేని పోరాటం : అనంతరం బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ హయాంలో నాయకుల మీటింగ్‌లకు ప్రజలను బలవంతంగా తరలించారని సీఎం గుర్తు చేశారు. వైఎస్సార్సీపీ నేతలు ప్రజాస్వామ్య హద్దులు దాటి ఇబ్బంది పెట్టారని ధ్వజమెత్తారు. బాధ్యత గల ప్రజాప్రతినిధి తానని, తప్పు చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టనని తేల్చి చెప్పారు. రాజకీయ కక్షసాధింపులకు పోనని పునరుద్ఘాటించారు. నాయకుడు అంటే ప్రజల మనసుల్లో అభిమానం ఉండాలని, తనను అరెస్టు చేశాక తెలుగు ప్రజలంతా ఏకమయ్యారని, మొన్నటి ఎన్నికల్లో తెలుగు తమ్ముళ్లు, జనసైనికులు రాజీలేని పోరాటం చేశారని, అందరం కలిసి రాష్ట్రాన్ని కాపాడుకున్నామని తెలిపారు.
పలాసలో ఎయిర్పోర్ట్ ఏర్పాటు : విశాఖను ఫైనాన్షియల్ క్యాపిటల్‌గా అభివృధ్ధి చేస్తున్నామని, విశాఖ స్టీల్ ప్లాంట్‌ను కాపాడతామని హామీ ఇచ్చామని గుర్తు చేశారు. ఇప్పటికే రెండు, మూడు మీటింగ్‌లు జరిగాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం డబ్బులు కూడా ఇచ్చిందని, రెండో ఫర్నేస్‌లో ఆపరేషన్ ప్రారంభమైందని వెల్లడించారు. విశాఖ రైల్వే జోన్‌కు (సౌత్ కోస్టల్ రైల్వే) లైన్ క్లియర్ చేశామని, అందుకోసం రేపో ఎల్లుండో భూమి పూజ కూడా చేస్తామన్నారు. టెక్కలి లేదా పలాసలో ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేస్తామని, మూలపేటలో 10వేల ఎకరాల్లో ఇండస్ట్రీయల్ కారిడార్ ఏర్పాటుకు హామీ ఇచ్చారు.
'నేను జైల్లో ఉన్నప్పుడు అలా చేశారు - ధైర్యంగా ఎదుర్కోవడంతో నా జోలికి ఎవరూ రాలేకపోయారు'
ఫ్రీ గ్యాస్ సిలిండర్ల పంపిణీకి వేళాయే - బుకింగ్స్‌లో ప్రాబ్లమ్స్ ఉంటే వెంటనే ఇలా చేయండి