Love Marriages parents permission must Gujarat : ప్రేమ వివాహాలకు తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి చేసే వ్యవస్థను తీసుకొచ్చేందుకు అవకాశాలను పరిశీలిస్తున్నట్లు గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ వెల్లడించారు. రాజ్యాంగబద్ధంగా సాధ్యమైతే ఈ ప్రతిపాదనను అమలులోకి తెస్తామని పేర్కొన్నారు. పాటీదార్ వర్గానికి ప్రాతినిధ్యం వహించే 'సర్దార్ పటేల్ గ్రూప్' మెహ్సానాలో నిర్వహించిన సమావేశానికి సీఎం భూపేంద్ర పటేల్ హాజరయ్యారు. తల్లిదండ్రులు అనుమతిస్తేనే ప్రేమ వివాహాలు జరిగేలా చూడాలని పాటీదార్ వర్గం నుంచి వస్తున్న డిమాండ్లకు స్పందనగా ఈ వ్యాఖ్యలు చేశారు.
"ప్రేమించిన వారితో వివాహం చేసుకునేందుకు చాలా మంది యువతులు ఇంట్లో నుంచి పారిపోతున్నారు. ఈ ఘటనలపై అధ్యయనం చేయాలని వైద్య శాఖ మంత్రి రుషికేశ్ పటేల్ నాతో చెప్పారు. తద్వారా వివాహాలకు తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి చేసే వ్యవస్థను తీసుకురావచ్చో లేదో పరిశీలించవచ్చని అన్నారు. రాజ్యాంగం అనుమతిస్తే దీనిపై అధ్యయనం నిర్వహిస్తాం. ఈ సమస్య పరిష్కరించేలా మెరుగైన ఫలితాలు సాధించేందుకు ప్రయత్నిస్తాం."
-భూపేంద్ర పటేల్, గుజరాత్ ముఖ్యమంత్రి
Gujarat Love marriages parents mandatory : సీఎం ప్రతిపాదనకు విపక్ష కాంగ్రెస్ నాయకుడి నుంచి కూడా మద్దతు లభించడం విశేషం. ప్రభుత్వం అలాంటి బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెడితే.. తాను మద్దతిస్తానని కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇమ్రాన్ ఖేడావాలా ప్రకటించారు. 'ప్రస్తుతం ప్రేమ వివాహాల విషయంలో తల్లిదండ్రుల అభిప్రాయానికి లెక్కలేకుండా పోతోంది. ప్రేమ వివాహాలకు సంబంధించి రాజ్యాంగబద్ధంగా ప్రత్యేక వ్యవస్థ సృష్టించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ప్రేమ వివాహాలకు తల్లిదండ్రుల సమ్మతి తప్పనిసరి చేసే దిశగా అధ్యయనం చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. ఇలాంటి చట్టాన్ని అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెడితే.. ప్రభుత్వానికి నా మద్దతు ఉంటుంది' అని ఇమ్రాన్ స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా.. బలవంతపు మత మార్పిడులపై ఉక్కుపాదం మోపేలా ఇప్పటికే గుజరాత్ సర్కారు చర్యలు తీసుకుంది. వివాహాల పేరుతో మోసపూరితంగా మత మార్పిడి చేయడాన్ని నిషేధిస్తూ చట్టం తీసుకొచ్చింది. గుజరాత్ మత స్వేచ్ఛ చట్టానికి 2021లో పలు మార్పులు చేస్తూ.. బలవంతపు మత మార్పిడులకు పాల్పడితే 10 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించేలా నిబంధనలు తీసుకొచ్చింది. అయితే, ఈ వివాదాస్పద చట్టంలోని కొన్ని సెక్షన్లపై గుజరాత్ హైకోర్టు స్టే విధించింది. గుజరాత్ హైకోర్టు ఆర్డర్‌ను రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ప్రస్తుతం ఈ కేసు అత్యున్నత ధర్మాసనం వద్ద పెండింగ్‌లో ఉంది.