కర్ణాటకలో 2018లో కాంగ్రెస్‌తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం వల్ల ప్రజల్లో 12 ఏళ్లుగా తనపై ఏర్పడిన నమ్మకం మొత్తం పోయిందని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ నేత హెచ్డీ కుమార స్వామి అన్నారు. కాంగ్రెస్ స్థాయిలో భాజపా కూడా తనకు నమ్మక ద్రోహం చేయలేదన్నారు. హస్తం పార్టీ నేత సిద్ధరామయ్య చేసిన కుట్రల వల్లే నెలల వ్యవధిలోనే సీఎం పదవి కోల్పోయానని కుమారస్వామి పేర్కొన్నారు.
ఎన్నికల ప్రచారంలో జేడీఎస్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేసిన కాంగ్రెస్‌తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఉండాల్సి కాదని మైసూరులో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో చెప్పారు కుమార స్వామి. తన తండ్రి సూచన మేరకే ఆ పార్టీతో చేతులు కలిపినట్లు పేర్కొన్నారు.
కుమారస్వామి వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య మండిపడ్డారు. అబద్ధాలు చెప్పడంలో ఆయన నిపుణులని విమర్శించారు. 37 సీట్లే గెలుచుకున్న జేడీఎస్‌ను సీఎం పీఠంపై కూర్చోబెట్టడం తాము చేసిన తప్పా? అని ప్రశ్నించారు.
2018 అసెంబ్లీ ఎన్నికల అనంతరం కాంగ్రెస్, జేడీఎస్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అనంతరం కొద్ది నెలలకే తలెత్తిన అంతర్గత విభేదాల కారణంగా కొందరు నేతలు పార్టీ వీడటం వల్ల కుమార స్వామి ప్రభుత్వం 2019లో కుప్పకూలింది. యడియూరప్ప నేతృత్వంలోని భాజపా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.