కొవిడ్ అనేది మరో తరహా యుద్ధమని ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవణె అన్నారు. దేశ ప్రజలకు సహాయం చేయడానికి సైన్యం ఏ అవకాశాన్నీ విడిచిపెట్టడం లేదని చెప్పారు. ఒకవేళ భవిష్యత్తులో మూడో వేవ్ తలెత్తితే ప్రస్తుత మౌలిక సదుపాయాలతో దేశం సురక్షితంగా బయటపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
జమ్ము కశ్మీర్లో రెండు రోజులు పర్యటించిన ఆయన దిల్లీ తిరుగు పయనానికి ముందు అక్కడి విలేకరులతో మాట్లాడారు. దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు.
"కరోనా రెండో వేవ్‌లో విజయం సాధించే దిశగా పయనిస్తున్నాం. గత నెలన్నర రోజులుగా అనేక మౌలిక సదుపాయాలను మనం అభివృద్ధి చేశాం. ఒకవేళ భవిష్యత్తులో మూడోవేవ్ వస్తే.. ఈ సదుపాయాల ద్వారా దాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం. కరోనా వల్ల ప్రభావితం కాని కుటుంబం దేశంలో లేదేమో. ఈ సమయంలో సైనిక దళాలుగా దేశ ప్రజలకు సాధ్యమైనంత సాయం చేయడం మా బాధ్యత. మేము ఉన్నది దేశ ప్రజల కోసమే. కాబట్టి మాకు సాధ్యమైన అన్ని ప్రయత్నాలు చేశాం. ఏ ఒక్క వనరునూ వదిలిపెట్టలేదు."
-జనరల్ నరవణె, ఆర్మీ చీఫ్
మెట్రో నగరాలతో పాటు ఇతర ప్రాంతాల్లో సైనిక ఆస్పత్రులను ఏర్పాటు చేసినట్లు జనరల్ నరవణె తెలిపారు. సైన్యంలో పనిచేసే వైద్యులు, సిబ్బందిని తీవ్రత ఎక్కువ ఉన్న ప్రాంతాలకు పంపించినట్లు చెప్పారు.
పాక్ కాల్పుల విరమణపై
భారత్-పాకిస్థాన్ సరిహద్దులో కాల్పుల విరమణ కొనసాగింపు అంశం పాక్ వైఖరి మీదే ఆధారపడి ఉంటుంది జనరల్ నరవణె అన్నారు. ఒప్పందానికి పాక్ కట్టుబడి ఉన్నంత కాలం భారత్ కాల్పుల విరమణను కొనసాగిస్తుందని పేర్కొన్నారు. అయితే సైన్యం అప్రమత్తంగానే ఉంటుందని.. సరిహద్దు ఉగ్రవాద కార్యకలాపాలు ఇంకా కొనసాగడమే అందుకు కారణమని స్పష్టం చేశారు.
'కొన్ని దశాబ్దాలుగా ఇరు దేశాల మధ్య విశ్వసనీయత లోపిస్తోంది. కాబట్టి ఒక్కరోజులో పరిస్థితిలో మార్పులు రావు. కానీ పాకిస్థాన్ ఈ కాల్పుల విరమణను కొనసాగిస్తే అప్పుడు ఆ దేశం మీద నమ్మకం పెరిగేందుకు అవకాశాలు ఉంటాయి' అని జనరల్ నరవణె అన్నారు.
గత 100 రోజులుగా కాల్పులకు తెగబడని పాక్‌ను నమ్మవచ్చా అనే ప్రశ్నకు పైవిధంగా స్పందించారు.
అమర్నాథ్ యాత్రకు సిద్ధం
అమర్నాథ్ యాత్రకు సైన్యం అన్ని ఏర్పాట్లు చేసిందని.. అయితే యాత్ర నిర్వహణపై తుది నిర్ణయం జమ్ము కశ్మీర్ ప్రభుత్వానిదే అని జనరల్ నరవణె అన్నారు. 'నియంత్రణ రేఖ వద్ద, కశ్మీర్‌లోనూ పరిస్థితి మెరుగైంది. స్థానిక యువత హింసను మానుకోవాలి. దాని వల్ల వారికి ఎలాంటి ఉపయోగం ఉండదు' అని పేర్కొన్నారు.
ఇదీ చదవండి : పాక్‌లో కశ్మీర్ ప్రస్తావనపై భారత్ మండిపాటు