Lokesh Kanagaraj Psychology Examination : ప్రముఖ తమిళ దర్శకుడు లోకేశ్ కనగరాజ్‌కు మానసిక పరీక్షలు నిర్వహించాలని కోరుతూ మధురై కోర్టులో వాదనలు వినిపించారు ఓ వ్యక్తి. లోకేశ్ దర్శకత్వం వహించిన సినిమాలు హింసను ప్రేరేపించేలా ఉన్నాయని పిటిషనర్ రాజా మురుగన్ ఆరోపించారు. లోకేశ్ సినిమాలు ప్రజలపై మానసికంగా ప్రభావం చూపే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఇటీవల విడుదలైన 'లియో' చిత్రంలో హింస తీవ్రంగా ఉందని బుధవారం జరిగిన విచారణ సందర్భంగా పిటిషనర్ వాదించారు. ఇలాంటి చిత్రాలకు సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చే ముందు సీబీఎఫ్సీ (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్) మరింత జాగ్రత్తలు తీసుకునేలా ఆదేశించాలని న్యాయస్థానాన్ని కోరారు.
"లియోలో హింసను గొప్ప విషయంగా చూపించారు. ఆ చిత్రంలోని క్యారెక్టర్లు ప్రభుత్వ ఏజెన్సీల అండతో అక్రమ కార్యకలాపాల్లో భాగమైనట్లు చూపించారు. అలాంటి చిత్రాలు హానికరమైన ప్రభావం చూపుతాయి. అధిక వేగంతో వెళ్లడం, పోలీసుల అండతో నేరాలు చేయడం, చట్టవిరుద్ధ కార్యకలాపాల్లో పాల్గొనడం తప్పు కాదు అనే భావన ప్రేక్షకుల్లో ఏర్పడే ప్రమాదం ఉంది. తమ సినిమాల ద్వారా సామాజిక విలువలను పెంచే బాధ్యత ఫిల్మ్మేకర్లపై ఉంటుంది. కాబట్టి, లోకేశ్ కనగరాజ్‌పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. ఆయనకు మానసిక పరీక్షలు చేయాల్సిన అవసరం ఉంది."
-రాజా మురుగన్, పిటిషనర్
విచారణ వాయిదా
మధురై కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ కృష్ణకుమార్, జస్టిస్ విజయ్ కుమార్ వాదనలు ఆలకించారు. పిటిషనర్ తరఫున న్యాయవాదులు ఎవరూ హాజరు కాని కారణంగా విచారణను వాయిదా వేశారు.
భారీగా వసూళ్లు
లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా లియో సినిమాను తెరకెక్కించారు దర్శకుడు. కమర్షియల్‌గా ఈ చిత్రం పెద్ద హిట్ అయింది. ప్రపంచవ్యాప్తంగా రూ.600 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినట్టు చిత్రబృందం ప్రకటించుకుంది. అయితే, పొగతాగడం, హింస వంటి అంశాలను శ్లాఘిస్తూ చూపించడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. ముంబయిలోనూ ఈ సినిమాకు న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యాయి. తమిళం, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలైన ఈ చిత్రంలో దళపతి విజయ్, త్రిష, అర్జున్ సర్జా ప్రధాన పాత్రల్లో నటించారు.
'దుబాయ్‌లో గొడవ, చంపుతామని బెదిరింపులు'- పూజా హెగ్డే టీమ్ క్లారిటీ
Jayaprada Jail : నటి జయప్రదకు 6 నెలలు జైలు శిక్ష- వారి ఫిర్యాదు వల్ల!