Lokesh Fires on CM Jagan on Skill Case: జగన్ కక్షసాధింపులో భాగంగానే చంద్రబాబుపై కేసు పెట్టి వేధిస్తున్నారని `లోకేశ్ ఆరోపించారు. చంద్రబాబు తప్పు చేసినట్లు ఏ ఆధారం కూడా ప్రభుత్వం దగ్గర లేదని అన్నారు. ఇతర రాష్ట్రాల్లో అమలు చేసినట్లుగానే.. నైపుణ్య శిక్షణ ప్రాజెక్ట్‌ను చంద్రబాబు ఏపీలో అమలు చేశారని వివరించారు. ఆయా రాష్ట్రాల్లో కనిపించని తప్పులు.. జగన్ ప్రభుత్వానికి ఇక్కడే కనిపించాయా అని లోకేశ్ ప్రశ్నించారు. రాబోయే ఎన్నికల్లో ఇబ్బందలకు గురి చేయటానికే.. జగన్ ఈ విధంగా వ్యవహరిస్తున్నారన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతిమంగా ధర్మమే గెలుస్తుందని లోకేశ్ ధీమా వ్యక్తం చేశారు.
చంద్రబాబు నిర్దోషిగా బయటకు వస్తారు: స్కిల్ డెవలప్‌మెంట్ విభాగంలో నిధులు మళ్లించినట్లు ఆరోపణలు వచ్చాయని.. చంద్రబాబుకు ఆరోపణలకు ఎలాంటి సంబంధం లేదని లోకేశ్ స్పష్టం చేశారు. రాజకీయ ప్రతీకార కుట్రల్లో చేస్తున్న చర్యల్లో భాగంగానే చంద్రబాబును.. ఈ కేసులో ఇరికించారని నారా లోకేశ్ అన్నారు. చంద్రబాబు నేరం చేసినట్లూ నిరూపించే ఏ ఆధారం ఇప్పటి వరకు ప్రభుత్వం చూపలేదన్నారు. ఆయన నిర్దోషిగా బయటకు వస్తారని జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వూలో ధీమా వ్యక్తం చేశారు.
గుజరాత్‌లోనూ అమలు చేశారు: ఏపీలో నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ అందించేందుకు ప్రాజెక్ట్ రూపొందించామన్నారు. ఈ తరహా ప్రాజెక్ట్ గుజరాత్‌లోనూ అమలు చేశారని గుర్తుచేశారు. ఆ తర్వాత మరో ఆరు రాష్ట్రాల్లోనూ అమలైందన్నారు. ఆయా రాష్ట్రాల విధానాలనే తాము పాటించామన్నారు. ఒకవేళ షెల్ సంస్థలకు నిధులు మళ్లించినట్లు తేలితే.. రిమాండ్ రిపోర్ట్‌లో ఆ విషయం ప్రస్తావించాలి కదా అని లోకేశ్ అన్నారు.
నకిలీ ఇన్‌వాయిస్‌లు సృష్టించి షెల్ సంస్థలకు నిధులు మళ్లించారంటూ 2021లో ఎఫ్ఐఆర్ నమోదు చేసినా.. ఇప్పటి వరకు ఛార్జిషీట్ ఫైల్ చేయలేదని లోకేశ్ అన్నారు. ఈ కేసుకు సంబంధించి 36 మంది నిందితులను ఈడీ, ఐటీ అధికారులతో పాటు ఇతర విభాగాలకు చెందిన అధికారులు విచారించారని లోకేశ్ గుర్తుచేశారు. ఒకవేళ ఏమైనా తప్పు జరిగినట్లు తేలితే.. ఆయా దర్యాప్తుల్లో బయటపడేది కదా అన్నారు.
ప్రాజెక్ట్‌లో లేని అక్రమాలను వైసీపీ ప్రభుత్వం ఎలా చూపగలదు: మనీలాండరింగ్ జరిగినట్లు ఈడీ ఎక్కడా ప్రస్తావించలేదని.. అలాంటప్పుడు స్కిల్ డెవలప్‌మెంట్ విభాగంలో అక్రమాలు జరిగినట్లు.. అందుకు చంద్రబాబే కారణమని వైసీపీ ప్రభుత్వం అరెస్ట్‌లు చేయించడం దారుణమన్నారు. రాజకీయ కక్షతోనే ఏపీలో పాలన సాగుతోందన్నది వందశాతం నిజమన్నారు. ఏపీలో ఈ ప్రాజెక్ట్‌ను అమలు చేసిన సంస్థలే.. ఇతర రాష్ట్రాల్లోనూ ఇదే విధానంలో శిక్షణ ఇచ్చాయి. ఆయా రాష్ట్రాలు చెల్లించిన మొత్తం కన్నా.. చంద్రబాబు ప్రభుత్వం తక్కువే చెల్లించింది. ఈ ప్రాజెక్ట్‌లో లేని అక్రమాలను వైసీపీ ప్రభుత్వం ఎలా చూపగలదని లోకేశ్ ప్రశ్నించారు.
రాబోయే ఎన్నికల్లో ఇబ్బందులు పెట్టేందుకే: రానున్న ఎన్నికల్లో టీడీపీని ఇబ్బంది పెట్టేందుకే జగన్ ఈవిధంగా చేశారని.. ఆయనపై 36 కేసులు ఉన్నాయని, తనలాగే అందరూ జైలుకు వెళ్లాలని కేసుల్లో ఇరికిస్తున్నారన్నారు. జగన్ క్విడ్ ప్రోకోకు పాల్పడినట్లు డాక్యుమెంట్ ఆధారాలు ఉన్నాయన్నారు. ఆ నిధులు, సాక్షి పత్రిక, టీవీ, సిమెంట్ సంస్థ, విద్యుత్ ప్రాజెక్టులు సహా బెంగళూరులో వాణిజ్య సముదాయానికి మళ్లించినట్లు నిరూపితమైందన్నారు.
వైసీపీ ప్రభుత్వంపై పోరాడి విజయం సాధిస్తాం: చంద్రబాబు నిధులు మళ్లించినట్లయితే ఆధారాలతో చూపాలన్నారు. ఇదంతా నిందలు మోపడం తప్ప మరొకటి కాదని లోకేశ్ వెల్లడించారు. ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా అంతిమంగా ధర్మమే గెలుస్తుందన్నారు. 1985లో ఎన్టీఆర్‌ను కేంద్రం అన్యాయంగా పదవి నుంచి దించేస్తే.. పోరాడి మళ్లీ అధికారం దక్కించుకున్న చరిత్ర తెలుగుదేశం పార్టీకి ఉందని లోకేశ్ గుర్తు చేశారు. మరోసారి తెలుగుదేశం శ్రేణులు వైసీపీ ప్రభుత్వంపై పోరాడి వచ్చే ఎన్నికల్లో విజయం సాధిస్తారని.. చంద్రబాబు సీఎం కావడం ఖాయమని లోకేశ్ ధీమా వ్యక్తం చేశారు.