కొవిడ్ కోరల నుంచి విముక్తికి సమైక్యంగా పోరాడదామని లోక్‌సభ సభాపతి ఓం బిర్లా పిలుపునిచ్చారు. 'కొవిడ్-19 వ్యాప్తి-ప్రజా ప్రతినిధుల పాత్ర, బాధ్యత' అనే అంశంపై శాసనసభల స్పీకర్లు, శాసనమండలి ఛైర్మన్లు, సభా వ్యవహారాల మంత్రులు, చీఫ్ విప్‌లు , ఉభయసభల్లోని ప్రతిపక్ష నాయకులతో సోమవారం ఆయన ఆన్లైన్ ద్వారా సమావేశమయ్యారు. కొవిడ్ నేపథ్యంలో ప్రజా ప్రతినిధులు నిర్వహించాల్సిన పాత్రపై ఓం బిర్లా దిశానిర్దేశం చేశారు.
" గతేడాదితో పోలిస్తే రెండో దశ ఉద్ధృతి ఎక్కువగా ఉండడం తీవ్ర ఆందోళనను కలుగజేస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ స్థాయిలో చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నాయి. ఈ మహమ్మారి నుంచి సమాజం, దేశం విముక్తి పొందేందుకు ప్రజా ప్రతినిధులు తమ విధులను మరింత సమర్థంగా నిర్వహించాలి. మహమ్మారి విషయంలో ప్రజలను జాగృతం చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకునేలా స్పీకర్లు, ఛైర్మన్లు చొరవచూపాలి. కొవిడ్‌పై పోరులో వ్యక్తిగత జాగ్రత్తలే బలమైన ఆయుధం. ఏమాత్రం నిర్లక్ష్యం ప్రదర్శించినా అది తీవ్ర ప్రమాదకరంగా మారుతుందని ప్రజా ప్రతినిధులు ప్రజలకు అవగాహన కల్పించాలి. కేంద్రం దృష్టికి తీసుకెళ్లాల్సిన సమస్యలేమైనా ఉంటే వాటిని లోక్‌సభ కంట్రోల్ రూంకు పంపించాలి. ఈ విపత్కర సమయంలో లోక్‌సభ, రాష్ట్రాల శాసన వ్యవస్థలు కలిసికట్టుగా పని చేయాలి. టీకా కార్యక్రమాన్ని మరింత ముమ్మరం చేయాల్సిన అవసరం ఉంది. టీకాల విషయంలో ప్రజా ప్రతినిధులు స్థానిక సంస్థలతో మమేకమై పని చేయాలి."
ఓం బిర్లా, లోక్‌సభ స్పీకర్
టీకాలు, ఆక్సిజన్ కొరత, రాష్ట్రాలకు చెల్లించాల్సిన జీఎస్టీ బకాయిల గురించి కొన్ని రాష్ట్రాలు ఈ సమావేశంలో లేవనెత్తాయి.