Little Astronomer Vedanta : ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసికి చెందిన వేదాంత్ పాండే.. స్పేస్ ఫొటోగ్రఫీలో రాణిస్తూ స్థానికంగా ప్రశంసలు అందుకుంటున్నాడు. 17 ఏళ్ల వయసులోనే అంతరిక్ష అన్వేషణ చేస్తున్న అతడిని చిన్న ఖగోళ శాస్త్రవేత్త అని పిలుచుకుంటున్నారు. ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న అతడు.. భవిష్యత్తులో అనేక ఘనతలు సాధిస్తాడని చెబుతున్నారు.
వారణాసిలో నివాసం ఉంటున్న వేదాంత్ పాండే.. స్థానికంగా ఓ కళాశాలలో ఇంటర్ తొలి సంవత్సరం చదువుతున్నాడు. చిన్నప్పటి నుంచే ఖగోళ శాస్త్రంపై ఎంతో ఆసక్తి పెంచుకున్న అతడు.. టెలీస్కోప్ ద్వారా అద్భుతమైన చిత్రాలను బంధిస్తున్నాడు. ఇటీవలే చంద్రుడిని ఉల్కలు ఢీకొన్న సమయంలో అతడు తీసిన చిత్రాన్ని కెనడా సీనియర్ శాస్త్రవేత్త ధ్రువీకరించారు. చంద్రుడిని స్పష్టంగా ఫొటో తీసి టైటిల్‌ను కూడా గెలుచుకున్నాడు వేదాంత. దాంతో పాటు 50ఏళ్లలో ఒకసారి కనిపించే గ్రీన్ కామిక్ చిత్రాన్ని కూడా వేదాంత తన టెలీస్కోప్‌తో బంధించాడు.
"నేను 2021 సంవత్సరంలో స్పేస్ ఫొటోగ్రఫీ ప్రారంభించాను. నాకు చిన్నప్పటి నుంచి ఈ రంగంపై ఆసక్తి. చిన్నప్పటి నుంచి ఖగోళ శాస్త్రవేత్త కావాలని.. ఆస్ట్రోఫొటోగ్రఫీ చేయాలనుకునేవాడిని. మనం భారతదేశంలో నివసిస్తున్నా.. ఆస్ట్రోఫొటోగ్రఫీ చేయవచ్చని ప్రజలకు చెప్పాలనుకుంటున్నాను. నేను వివిధ గ్రహాలు, మిల్కీవే గెలాక్సీ, ఆండ్రోమెటా గెలాక్సీల ఫొటోలు తీశాను. దీంతో పాటు విశ్వంలోని అన్ని గెలాక్సీల్లో వచ్చే విభిన్న కొత్త కామిక్స్‌ను కూడా బంధించాను. చంద్రుడు, నక్షత్రాల చిత్రాలను కూడా తీస్తున్నాను."
- వేదాంత పాండే, విద్యార్థి
'వేదాంత ద్వారా చాలా నేర్చుకుంటున్నా..'
తాను వేదాంత ద్వారా చాలా నేర్చుకుంటున్నట్లు అతడి సోదరి ఆస్థా పాండే తెలిపింది. రాత్రిపూట ఆకాశంలో జరిగే అద్భుతాలను చూడాలనుకుంటే కాంతికి దూరంగా చీకట్లో కూర్చోవాలని చెప్పింది. అలా అంతరిక్ష అన్వేషణ ద్వారా కొత్త విషయాలు తెలుసుకోవచ్చని వివరించింది.
"మా సోదరుడు చాలా కష్టపడతాడు. మేమ అంతలా కష్టపడలేం. ఖాళీగా కూర్చుంటాం. మధ్యాహ్నం పాఠశాలకు వెళతాడు. రాత్రంతా మేల్కొని అంతరిక్షాన్ని పరిశీలిస్తాడు. వేదాంత ద్వారా నక్షత్రాలను చూసే అవకాశం నాకు దక్కింది."
- ఆస్థా పాండే, వేదాంత సోదరి
'చిన్న ఖగోళ శాస్త్రవేత్త అని పిలుస్తుంటే.. చాలా సంతోషంగా'
తన కుమారుడిని అందరూ చిన్న ఖగోళ శాస్త్రవేత్త అని పిలుస్తుంటే.. చాలా సంతోషంగా అనిపిస్తుందని వేదాంత తండ్రి జితేంద్ర పాండే తెలిపాడు. అనేక ప్రాంతాలకు చెందిన ప్రజలు, ప్రముఖులు తమ కుమారుడిని అభినందిస్తున్నారని చెప్పాడు. వేదాంతను చిన్నప్పుడు నుంచి అన్నివిధాల ప్రోత్సహించామని.. భవిష్యత్తులో కూడా పూర్తిగా సహకరిస్తామని వెల్లడించాడు.