సుప్రీంకోర్టులోని అడ్వకేట్స్ ఛాంబర్ బ్లాక్‌ను తాత్కాలిక కొవిడ్ కేంద్రంగా మార్చాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్. ఎన్.వి రమణకు సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు, సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్ లేఖ రాశారు. దేశ రాజధానిలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రత దృష్ట్యా వైద్య సదుపాయాల కల్పనకు న్యాయవాదుల భవనాన్ని వినియోగించేలా అనుమతి ఇవ్వాలని కోరారు.
కరోనా మహమ్మారి అన్ని రంగాలను ప్రభావితం చేసిందన్న బార్ అసోసియేషన్ ఇందుకు సుప్రీంకోర్టు సైతం మినహాయింపు కాదని లేఖలో పేర్కొంది. కరోనా పరిస్థితుల్లోనూ అసోసియేషన్ సభ్యులు ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వరిస్తున్నట్లు గుర్తు చేసింది. దిల్లీలో లాక్ డౌన్ పొడిగింపు నేపథ్యంలో సుప్రీంకోర్టు వేసవి సెలవులను ముందుకు జరిపి సోమవారం నుంచే ప్రకటించాలని బార్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది.
ఇదీ చూడండి: మరో వారం రోజులు లాక్‌డౌన్‌లోనే దిల్లీ