తమిళనాట ఎన్నికల సమరం రసవత్తరంగా సాగుతోంది. దిగ్గజ నేతలు జయలలిత, కరుణానిధి లేకపోయినా.. అన్నాడీఎంకే, డీఎంకే మధ్య పోరులో ఏమాత్రం వేడి తగ్గలేదు. పళనిస్వామి నేతృత్వంలో అన్నాడీఎంకే, స్టాలిన్ నాయకత్వంలో డీఎంకే ఢీ అంటే ఢీ అంటున్నాయి. అధికార పీఠం కోసం సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. దీంతో పోరు ఉత్కంఠభరితంగా మారింది. ఈ నేపథ్యంలో తాజా ఎన్నికల్లో రెండు పార్టీలూ అనుసరిస్తున్న వ్యూహాలను ఓసారి పరిశీలిస్తే..
అన్నాడీఎంకే పళని పరిణతి
![AIADMK and DMK](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11148201_ghpolitics-1c_5-2.jpg)
![AIADMK and DMK](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11148201_ghpolitics-1c_5-1.jpg)
జయలలిత ఉన్నన్నాళ్లూ ఆమె నీడలో ఉన్న పళనిస్వామి.. ఆమె మరణానంతరం అనూహ్య పరిస్థితుల్లో సీఎం పీఠాన్ని దక్కించుకున్నారు. నాలుగేళ్ల క్రితంతో పోలిస్తే ఆయనలో పరిణతి పెరిగింది. పన్నీర్‌సెల్వం సహా అందర్నీ కలుపుకొని వెళ్తున్నారు. నూతన సాగు చట్టాలపై రైతుల్లో వ్యతిరేకత వ్యక్తమవుతుండటంతో.. తానూ రైతునేనని గుర్తుచేస్తున్నారు. మిత్రపక్షాలతో సీట్ల సర్దుబాటు వల్ల అన్నాడీఎంకే నేతల్లో అసమ్మతి తలెత్తకుండా పళని, పన్నీర్ జాగ్రత్తలు తీసుకున్నారు. ముగ్గురు మినహా మంత్రివర్గంలోని నేతలందరికీ టికెట్లు దక్కేలా చూశారు. తమ అనుకూలవర్గ నేతలకు వారిద్దరూ టికెట్ల కేటాయింపులో పెద్దపీట వేశారు.
ప్రజాభిప్రాయం తెలుసుకొని..
2019 సార్వత్రిక ఎన్నికల్లో, రాష్ట్రంలో 22 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో అన్నాడీఎంకేకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అది పార్టీ అగ్ర నాయకత్వానికి కనువిప్పు కలిగించింది. ఎంజీఆర్, జయలలిత హయాంలో పార్టీ ఎలా నడిచిందో.. వారు ఎలాంటి వ్యూహాలు అమలు చేశారో పళని, పన్నీర్ గ్రహించారు. 'వెట్రినడై పోడుం తమిళగం' పేరుతో రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, అభివృద్ధిపై ప్రచారాలు నిర్వహించారు. ప్రభుత్వంపై ప్రజల అభిప్రాయం తెలుసుకునేందుకు ప్రైవేటు ఏజెన్సీల ద్వారా అధ్యయనం చేయించారు. అసెంబ్లీ ఎన్నికల వ్యూహకర్తలనూ పార్టీ నియమించుకుంది. రైతులను ఆకర్షించేందుకుగాను.. సహకార బ్యాంకుల్లోని వారి రుణాలను ముందుగానే మాఫీ చేసింది.
ఇదీ చదవండి: గెలుపు వేటలో... తమిళనాట చీలికల బాట
మేనిఫెస్టో చుట్టూనే ప్రచారం
జయలలిత స్థాయిలో జనాకర్షణ ఉన్న నేతలెవరూ ప్రస్తుతం అన్నాడీఎంకేలో లేరన్నది కాదనలేని వాస్తవం! అందుకే పళనిస్వామి, పన్నీర్‌సెల్వం వంటి సీనియర్ నేతలు జనాన్ని తమవైపునకు తిప్పుకొనేందుకు మేనిఫెస్టోనే ప్రధానాస్త్రంగా ఉపయోగించుకుంటున్నారు. అందులోని తమ హామీలనే విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ప్రచారంలో అన్నాడీఎంకే ఎక్కువగా ఉపయోగించుకుంటున్న మరో అస్త్రం.. 'వారసత్వ రాజకీయాల'. స్టాలిన్‌పై ఈ విమర్శను పళనిస్వామి పదేపదే ఎక్కుపెడుతున్నారు.
ఇదీ చదవండి: డీఎంకే వారసత్వ, ప్రజాస్వామ్య వ్యతిరేక పార్టీ: భాజపా
డీఎంకే సానుభూతే అస్త్రంగా..
![AIADMK and DMK](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11148201_ghpolitics-1c_5-4.jpg)
![AIADMK and DMK](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11148201_ghpolitics-1c_5-3.jpg)
కరుణానిధి మరణానంతరం డీఎంకేపై పూర్తిస్థాయిలో పట్టు సాధించిన ఆయన కుమారుడు స్టాలిన్.. తాజా ఎన్నికల్లో అన్నీ తానై పార్టీని నడిపిస్తున్నారు. తన తండ్రికి ప్రజల్లో ఉన్న ఆదరణను బాగానే ఉపయోగించుకుంటున్నారు. పార్టీ అభ్యర్థుల జాబితాను గోపాలపురంలోని కరుణానిధి నివాసంలో, మెరీనా బీచ్‌లోని ఆయన సమాధి వద్ద ఉంచిన తర్వాతే.. స్టాలిన్ విడుదల చేశారు. ఎన్నికల్లో విజయాన్ని ఆయన సమాధి వద్ద కానుకగా ఉంచాలని పార్టీ కార్యకర్తలకు భావోద్వేగపూరితంగా పిలుపునిచ్చారు. సానుభూతిని ఓట్ల రూపంలోకి మార్చేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. స్టాలిన్ వ్యవహరిస్తున్న తీరు జయలలిత శైలిని పోలి ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. స్టాలిన్ సోదరి కనిమొళి, కుమారుడు ఉదయనిధి కూడా డీఎంకే అభ్యర్థులకు మద్దతుగా విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి పళనిస్వామి సహా ప్రతిపక్ష నేతలందరిపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో దక్కిన అద్భుత గెలుపు డీఎంకేకు ప్రేరణగా నిలుస్తోంది.
ప్రశాంత్ కిశోర్‌తో జట్టు!
ఈ దఫా ఎలాగైనా అధికారాన్ని చేజిక్కించుకోవాలని ఉవ్విళ్లూరుతున్న డీఎంకే.. అందుకు తగ్గట్లే పక్కా ప్రణాళికలతో వ్యవహరిస్తోంది. ప్రముఖ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ నేతృత్వంలోని సంస్థతో ఆ పార్టీ జట్టు కట్టింది. ప్రజల్లోకి వెళ్లేందుకు అనేక కార్యక్రమాలు చేపట్టింది. 'ఉంగళ్ తొగుదియిల్ స్టాలిన్' పేరుతో రాష్ట్రవ్యాప్తంగా ప్రచారాన్ని నిర్వహించి విజ్ఞప్తులు స్వీకరించింది. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోపు వాటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది. 'అన్నాడీఎంకేను నిరాకరిద్దాం' నినాదంతో గ్రామ సభల తరహాలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించింది.
ఇదీ చదవండి: భాజపా 'మిషన్ 100+' లక్ష్యంలో తొలి విడతే కీలకం