Two women marriage: దేశంలో ఇద్దరు యువతులు ప్రేమించుకుని పెళ్లిళ్లు చేసుకుంటున్న సంఘటనలు ఇటీవల పెరిగాయి. అలాంటిదే ఝార్ఖండ్‌లోని ధన్‌బాద్ జిల్లాలో జరిగింది. ఇక్కడ తన ప్రేయసి కోసం వివాహమైన తెల్లారే భర్తను వదిలేసింది ఓ మహిళ. ప్రేమికురాలితో వెళ్లిపోయింది. ఈ సంఘటన ప్రస్తుతం ఆ ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది. తమ జీవితానికి అడ్డువస్తున్నారని కుటుంబ సభ్యులపై మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది ఆ యువతి.
ఇదీ జరిగింది..
ధన్‌బాద్ నగరంలోని పురానా బజార్‌కు చెందిన యువతికి దేవ్‌ఘర్‌లో 2021, డిసెంబర్ 11న వివాహం అయింది. పెళ్లి జరిగిన రెండో రోజే భర్తను వదిలేసి అత్తింటి నుంచి తిరిగి వచ్చేసింది. గోల్ఫ్ గ్రౌండ్‌కు సమీపంలో ఉండే మరో యువతితో తాను జీవించాలనుకుంటున్నానని చెప్పి వెళ్లిపోయింది. చిన్నప్పటి నుంచి ఇద్దరు మంచి స్నేహితులని తెలిపారు కుటుంబ సభ్యులు. ఇలా చేస్తుందని తెలియదన్నారు.
భర్తను వదిలేసి వచ్చిన క్రమంలో ఇరువురి కుటుంబాల మధ్య గొడవలు మొదలయ్యాయి. దీంతో నెల రోజుల తర్వాత పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించింది యువతి. తాను గోల్ఫ్ గ్రౌండ్ సమీపంలో ఉండే స్నేహితురాలితోనే జీవించాలనుకుంటున్నట్లు తెలిపింది. ఇద్దరూ చిన్నతనం నుంచే ప్రేమించుకుంటున్నట్లు చెప్పింది.
పోలీసులను ఆశ్రయించిన విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు స్టేషన్‌కు చేరుకుని జరిగిన విషయం చెప్పారు. ఈ క్రమంలో ఇద్దరు యువతులకు కౌన్సిలింగ్ ఇచ్చే పనిలో పడ్డారు పోలీసులు.
ఇదీ చూడండి: ఇద్దరు మహిళా డాక్టర్ల ప్రేమాయణం.. త్వరలోనే పెళ్లి!