కుటుంబ రాజకీయాలపై వెల్లువెత్తుతున్న ఆరోపణలను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తనదైన రీతిలో తిప్పికొట్టారు. తన కుటుంబం నుంచి చివరిసారిగా ఓ వ్యక్తి ప్రధాని పదవి చేపట్టి.. 30ఏళ్లు అయ్యిందన్నారు. మాజీ ప్రధాని కుమారుడిననే భావంతో తన ఆలోచనా దృక్పథాన్ని కోల్పోనని తేల్చిచెప్పారు.
చికాగో విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ దీపేశ్ చక్రవర్తితో లైవ్ ఛాట్‌లో మాట్లాడిన రాహుల్ గాంధీ.. 'ట్రోల్స్' తనకు మార్గనిర్దేశకాలని అన్నారు. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలు ప్రజల కోసం పోరాడుతూ మృతిచెందారని, అది చాలా గర్వంగా అనిపిస్తుందని చెప్పారు. వారి నుంచి చాలా విషయాలు నేర్చుకున్నట్లు వెల్లడించారు.
యూపీఏ ప్రభుత్వం ప్రజాదరణ కోల్పోతోందన్న విమర్శలపై మాట్లాడిన రాహుల్.. భారత్ వంటి పెద్ద వ్యవస్థల కోసం నిర్దిష్ట కాలంలో ఒక ప్రత్యేక విజన్‌ను అందించగలగాలని అన్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించారు. మోదీ విజన్ పూర్తిగా విఫలమైందని ఆరోపణలు చేశారు. రానున్న రోజుల్లో అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ కొత్త వ్యూహాలు రచించాల్సి ఉందని పేర్కొన్నారు.
ఇదీ చదవండి:ఉత్తర భారతంలో భూప్రకంపనలు