ఉత్తర్ప్రదేశ్ లఖింపుర్ హింసాత్మక ఘటనలో ఇద్దరిని ప్రశ్నించినట్లు లఖ్నవూ ఐజీ లక్ష్మీ సింగ్ వెల్లడించారు. తమకు ఇప్పటికే కీలక సమాచారం లభించిందని తెలిపారు.
తాజాగా కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా తనయుడు ఆశిష్ మిశ్రాకు సమన్లు పంపినట్లు స్పష్టం చేశారు. అతడిని ప్రశ్నించనున్నట్లు వెల్లడించారు.
లఖింపుర్ ఘటనలో.. అసలు నిందితులు ఎవరు, ఎవరిపై కేసు నమోదు చేశారు, ఎవరిని అరెస్టు చేశారనే వివరాలతో.. స్టేటస్ రిపోర్టు ఇవ్వాలని యూపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది సుప్రీం కోర్టు. తదుపరి విచారణ.. రేపటికి వాయిదావేసింది. ఈ నేపథ్యంలోనే లఖింపుర్ కేసు విచారణను వేగవంతం చేసింది యోగి సర్కార్. నిందితులను పట్టుకునే పనిలో ఉంది.
ఇదీ జరిగింది..
నూతన వ్యవసాయ చట్టాల రద్దు కోరుతూ.. అక్టోబర్ 3న లఖింపుర్ ఖేరిలో ఆందోళన చేస్తున్న రైతులపైకి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా కారు, మరో వాహనం దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు రైతులు మరణించగా, అనంతరం జరిగిన ఘర్షణలో మరో నలుగురు చనిపోవడం.. దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపింది. దీంతో ఆశిష్ మిశ్రా సహా పలువురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పుడు ప్రశ్నించేందుకు పిలిచారు.