Lakhimpur Kheri News: 2024లో యూపీలో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాపై పోటీ చేస్తానని లఖింపుర్ ఖేరీ ఘటనలో మృతిచెందిన రైతు నచతార్ సింగ్ పెద్ద కుమారుడు జగదీప్ సింగ్ ప్రకటించారు.
ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్ కోరగా.. లోక్‌సభ ఎన్నికల్లోనే పోటీ చేయాలనే ఉద్దేశంతో తాను తిరస్కరించినట్లు పేర్కొన్నారు జగదీప్ సింగ్.
"లఖింపుర్‌లోని దౌరాహరా స్థానం నుంచి పోటీ చేయాల్సిందిగా.. ఎస్పీ, కాంగ్రెస్ నన్ను సంప్రదించాయి. కానీ నేను చిన్న చిన్న యుద్ధాల్లో పాల్గొనని చెప్పా. 2024 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వమని అడిగా. నేను అజయ్ మిశ్రాపై ప్రత్యక్షంగా పోటీచేస్తా. నేను పోరాడాలి. సరైన పద్ధతిలో పోరాడాలి." అని జగదీప్ సింగ్ తెలిపారు. తన కుటుంబంలో ఎవరికీ రాజకీయ నేపథ్యం లేదన్నారు జగదీప్ సింగ్.
"నేను ఏ పార్టీకీ మద్దతు ఇవ్వడం లేదు. ప్రస్తుతం మేము రైతు నాయకులు తేజేందర్ సింగ్‌కు మద్దతుగా ఉన్నాం." అని జగదీప్ సింగ్ అన్నారు.
బ్రాహ్మణుల ఓటు బ్యాంకు దృష్ట్యా అజయ్ మిశ్రాను కేంద్రప్రభుత్వం పదవి నుంచి తొలగించలేదని జగదీప్ మండిపడ్డారు. మిశ్రా పదవిలో ఉన్నంతకాలం తమకు న్యాయం జరగదని ఆవేదన వ్యక్తం చేశారు.
లఖింపుర్ ఖేరీ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా ప్రస్తుతం జైల్లో ఉన్నారు.
Lakhimpur Kheri case
అక్టోబర్ 3న జరిగిన లఖింపుర్ ఘటనలో నలుగురు రైతులు సహా ఎనిమిది మంది మరణించారు. నిరసన చేస్తున్న రైతుల పైకి కేంద్ర మంత్రి అజయ్ మిశ్ర కుమారుడు ఆశిశ్ మిశ్ర కారు దూసుకెళ్లింది. కారు ఢీకొని నలుగురు రైతులు ప్రాణాలు కోల్పోగా.. అనంతరం చెలరేగిన హింసలో ఓ జర్నలిస్ట్ సహా నలుగురు చనిపోయారు. ఆశిశ్ మిశ్ర సహా పలువురిని సిట్ అరెస్టు చేసింది. నిందితులు ప్రస్తుతం లఖింపుర్ ఖేరి జిల్లా కారాగారంలో ఉన్నారు.
ఇదీ చూడండి: చివరి నిమిషంలో నామినేషన్‌కు మంత్రి పరుగో పరుగు..