Janardan Mishra News: భాజపా ఎంపీ జనార్దన్ మిశ్రా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కలెక్టర్ చెంప చెళ్లుమనిపించిన రాజకీయ నాయకుల జీవితం రెండేళ్ల పాటు వెలిగిపోతుందన్నారు. తాను కూడా కలెక్టర్‌ను ఎప్పుడు కొడదామా అని ఆత్రుతగా ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. మధ్యప్రదేశ్ రీవా పార్లమెంటు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈయన.. కర్ణాటక బెంగళూరులో జరిగిన భగవత్ శరణ్ మథుర్ 71వ జయంతి కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు.
జనార్దన్ మిశ్రా గతంలోనూ పలుమార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. గతేడాది డిసెంబర్లో రూ.15లక్షలకు మించి అవినీతి జరిగితేనే తన వద్దకు వచ్చి ఫిర్యాదు చేయాలని అనడం దూమారం రేపింది. 2019లోనూ ఓ ఐఏఎస్ అధికారిని సజీవంగా పూడ్చిపెడతానని బెదిరిస్తూ విశ్రా చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. అక్రమ కాలనీల్లో నివసించే ప్రజలను డబ్బులు అడిగితే ఇలా చేస్తానని ఆయన అన్నారు.
సురేష్ గోపిపై విమర్శలు: మలయాళ నటుడు, భాజపా రాజ్యసభ ఎంపీ సురేష్ గోపికి సంబంధించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. విషు కైనీత్తం పర్వదినాన్ని పురస్కరించుకుని సురేష్ గోపి కొందరికి డబ్బులు పంపిణీ చేశారు. అనంతరం వారంతా ఆయన పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. కారులో కూర్చొని డబ్బులు పంచుతూ, ప్రజలతో కాళ్లు మొక్కించుకున్న సురేష్ గోపి వీడియోను చూసిన నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పించారు. మహిళలతో కాళ్లు మొక్కించుకోవడం ఏంటని మండిపడ్డారు. సురేష్ గోపి మాత్రం వీటిని తోసిపుచ్చారు. బెక బెకా అరుస్తూ చికాకు తెప్పించే కప్పల సైన్యాన్ని చూసి తాను భయపడబోనని ఘాటుగా స్పందించారు.
విషు కైనీత్తం హిందూ పండుగను కేరళలో ఘనంగా జరుపుకుంటారు. చిన్నారులు, పెద్దలకు డబ్బులు పంచి వాళ్లను ఆశీర్వదిస్తే లక్ష్మీదేవి కటాక్షిస్తుందని నమ్ముతుంటారు. ఇందులో భాగంగానే సురేష్ గోపి గతవారం భాజపా కార్యకర్తలో కలిసి త్రిస్సూర్ జిల్లాలో కైనీత్తంను ప్రారంభించారు. ఆయన చేస్తున్న పనిని కొందరు సమర్థిస్తే, మరికొందరు మాత్రం ఎంపీ హోదాలో ఉండి ఇలా చేయడం ఏంటని విమర్శిస్తున్నారు. సురేష్ రాజ్యసభ ఎంపీ పదవీ కాలం ఈ నెలతో ముగుస్తుంది. గతేడాది కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో త్రిస్సూర్ నుంచి పోటీ చేసిన ఆయన ఓటమిపాలయ్యారు.
ఇదీ చదవండి: సూపర్ హెయిర్ స్టైలిస్ట్.. ఒకేసారి 28 కత్తెర్లతో కటింగ్