Krishna River Management Board Letter to AP: నాగార్జున సాగర్ జలాల కోసం ఆంధ్రప్రదేశ్-తెలంగాణ మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకున్న నేపథ్యంలో కృష్ణా బోర్డు స్పందించింది. సాగర్ కుడికాలువ నుంచి నీరు తీసుకోవడం ఆపాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కృష్ణా బోర్డు అదేశించింది. ఈ మేరకు ఏపీ జలవనరులశాఖ ముఖ్యకార్యదర్శికి కేఆర్ఎంబీ సభ్య కార్యదర్శి లేఖ రాశారు. ఏపీ ప్రభుత్వ తీరుపై తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేసినట్లు కృష్ణా బోర్డు తెలిపింది. నవంబర్ 29న సాగర్ డ్యామ్ ఆక్రమణకు ఏపీ పాల్పడిందని ఫిర్యాదులో పేర్కొందని చెప్పింది. సాగర్ కుడికాలువ నుంచి ఏపీ ప్రభుత్వం బలవంతంగా 5 వేల క్యూసెక్కులు నీటిని విడుదల చేసినట్లు ఫిర్యాదు చెప్పిందని తెలిపింది.
ఏపీ, తెలంగాణ పోలీసుల మధ్య ఘర్షణ వాతావరణం - నాగార్జునసాగర్ డ్యాంపై ఉద్రిక్తత
2023 అక్టోబర్ 10- 2024 ఏప్రిల్ 18 మధ్య 15 టీఎంసీలను.. 5 టీఎంసీల చొప్పున 3 విడతల్లో ఇవ్వాలని ఏపీ కోరిందని కృష్ణా బోర్డు చెప్పింది. తొలివిడతగా అక్టోబర్ 10 నుంచి 20 వరకు 5 టీఎంసీలు విడుదల చేసినట్లు లేఖలో పేర్కొంది. రెండోవిడతగా జనవరిలో 5 టీఎంసీలు.. మూడో విడతగా ఏప్రిల్‌లో 5 టీఎంసీలు విడుదల చేయాల్సి ఉందని వివరణ ఇచ్చింది. ఎలాంటి సమాచారం లేకుండా గురువారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నీరు విడుదల చేసిందని.. సాగర్ నుంచి నీటి విడుదలను తక్షణమే ఏపీ ప్రభుత్వం ఆపాలని కృష్ణా బోర్డు కోరింది.
జలశక్తి అత్యవసర సమావేశం: ప్రాజెక్టులపై 2 రాష్ట్రాల మధ్య వివాద పరిష్కారానికి కేంద్రం సిద్ధమైంది. సాగర్, శ్రీశైలం నిర్వహణను కృష్ణా బోర్డుకు అప్పగించే యోచనలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది. శనివారం ఉదయం 11 గంటలకు జలశక్తి శాఖ అత్యవసర భేటీ ఏర్పాటు చేసింది. కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి నేతృత్వంలో ఈ అత్యవసర సమావేశం జరగనుంది. సమావేశానికి హాజరుకావాలని ఏపీ, తెలంగాణ సీఎస్‌లకు సూచించింది. సీఆర్‌పీఎఫ్, సీఐఎస్‌ఎఫ్ డీజీలు, కేంద్ర జలసంఘం, కేఆర్ఎంబీ ఛైర్మన్లు కూడా రావాలని తెలిపారు. జలసంఘం, కేఆర్ఎంబీ ఛైర్మన్లు నేరుగా భేటీకి హాజరుకావాలని సూచించారు. సాగర్ వద్ద పరిస్థితి కొలిక్కి తేవడంపై అధికారులు చర్చించనున్నారు.
'నాగార్జునసాగర్ విషయంలో ఏపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరు సరికాదు'
అసలు ఈ వివాదం ఏంటంటే.. రాష్ట్ర విభజన సమయంలో గోదావరి, కృష్ణా నదీ జలాల బోర్డులు ఏర్పాటయ్యాయి. ఆ సమయంలో నాగార్జునసాగర్‌ను తెలంగాణ, శ్రీశైలం జలాశయాన్ని ఆంధ్రప్రదేశ్ నిర్వహించాలనే నిర్ణయం వెలువడింది. సదరు నిర్ణయం సరిగా అమలు కాలేదు. శ్రీశైలం డ్యామ్ ఎడమ విద్యుత్తు కేంద్రం నిర్వహణ, తదితరాలను తెలంగాణ రాష్ట్రమే చూసుకుంటోంది. అక్కడికి ఆంధ్రప్రదేశ్ అధికారులను రానివ్వడం లేదు. అదే సమయంలో నాగార్జునసాగర్ ప్రాజెక్టులో ఉన్న 26 గేట్లకు గానూ.. 13 గేట్లు తెలంగాణ, మిగిలిన 13 గేట్లు ఆంధ్రప్రదేశ్ భూభాగంలో ఉంటాయి.
Tension at Nagarjunasagar Reservoir: నాగార్జున సాగర్ వద్దకు గత బుధవారం అర్ధరాత్రి వందలాది మంది ఏపీ పోలీసులు, ఉన్నతాధికారులు డ్యాం వద్దకు చేరుకోవడంతో అక్కడ హైడ్రామా కొనసాగింది.. తెలంగాణ ఎస్‌పీఎల్ ఆధ్వర్యంలో ఉన్న డ్యాంను తమ ఆధీనంలోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. ఏపీ భూభాగ పరిధిలో ఉన్న 13వ గేటు వద్దకు చేరుకుని.. బారికేడ్లు, కంచెలు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఇరు రాష్ట్రాల పోలీసుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఏపీ పోలీసులు డ్యాం వద్ద సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. తెలంగాణ పోలీసులు తక్కవగా ఉండటం.. ఏపీ పోలీసులు సుమారు 400 మంది ఉండటంతో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. 13 గేటు వరకు డ్యాంను స్వాధీనం చేసుకున్న ఏపీ పోలీసులు నీటిని దిగువకు విడుదల చేసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో నీటి పారుదల శాఖ అధికారులు నీటిని తాగునీటి కోసం విడుదల చేశారు