కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివ కుమార్‌కు పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ను ఓ గద్ద బలంగా ఢీకొట్టింది. దీంతో కాక్‌పిట్ అద్దం పగిలిపోయింది. వెంటనే హెలికాప్టర్‌ను అత్యవసరంగా పైలట్ ల్యాండ్ చేశారు.
ఇదీ జరిగింది.. కర్ణాటక ఎన్నికల పోలింగ్ సమయం దగ్గర పడుతుండడం వల్ల.. కాంగ్రెస్ నేత డీకే శివ కుమార్ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. వరుస బహిరంగ సభల్లో పాల్గొంటున్నారు. అందులో భాగంగా కోలార్ జిల్లా ముల్‌బాగల్ బహిరంగ సభకు హాజరయ్యేందుకు మంగళవారం సిద్ధమయ్యారు. అందుకు గాను తన హెలికాప్టర్‌లో బెంగళూరులోని జక్కూర్ విమానాశ్రయం నుంచి బయలుదేరారు.
మార్గమధ్యలో డీకే శివ కుమార్.. హెలికాప్టర్‌ను ఓ గద్ద బలంగా ఢీకొట్టింది. దీంతో విండ్‌షీల్డ్ సగభాగం పగిలిపోయింది. వెంటనే అప్రమత్తమైన పైలట్.. హెలికాప్టర్‌ను హెచ్‌ఏఎల్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ఘటనా సమయంలో హెలికాప్టర్‌లో శివ కుమార్‌తో పాటు పైలట్, ఓ ప్రముఖ కన్నడ వార్తాసంస్థకు చెందిన జర్నలిస్టు కూడా ఉన్నారు. హెలికాప్టర్‌లో ఆ జర్నలిస్ట్‌కు శివ కుమార్ ఇంటర్వ్యూ ఇస్తున్నట్లు తెలుస్తోంది. పైలట్, జర్నలిస్ట్‌కు స్పల్ప గాయాలైనట్లు సమాచారం.
శివ కుమార్ ట్వీట్..
అయితే ఈ ఘటనపై డీకే శివ కుమార్.. ట్విట్టర్ వేదికగా స్పందించారు. "మేము ముల్‌బాగల్‌కు వెళ్తుండగా మా హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. నేను క్షేమంగా ఉన్నాను. అత్యవసరంగా ల్యాండింగ్ చేసినందుకు పైలట్‌కు ప్రత్యేక ధన్యవాదాలు. ముల్‌బాగల్‌కు రోడ్డు మార్గంలో చేరుకున్నాను" అని డీకే శివ కుమార్ ట్వీట్ చేశారు.
డీకే శివ కుమార్X అశోక్
త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో డీకే శివ కుమార్.. కనకపుర నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. అదే స్థానంలో మంత్రి ఆర్.అశోక్‌ను బీజేపీ బరిలోకి దింపింది. ఈ నియోజకవర్గం నుంచి ఆరుసార్లు నెగ్గిన శివ కుమార్‌ను ఓడించాలని బీజేపీ ఆశిస్తోంది. ఆయనకు గట్టి పోటీ ఇవ్వాలన్న లక్ష్యంతో అశోక్‌ను పోటీలో నిలిపింది.
ఇటీవలే ఓ సభలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయంపై శివ కుమార్ ధీమా వ్యక్తం చేశారు. 224 అసెంబ్లీ సీట్లు ఉన్న కర్ణాటకలో 141 సీట్లతో కాంగ్రెస్ ఘన విజయం సాధించబోతోందని ఆయన అన్నారు. ఈ ఎన్నికల ఫలితాలు 2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి నాంది పలకనున్నాయని చెప్పారు. రాష్ట్రంలో మోదీ ఫ్యాక్టర్ ఏమాత్రం పనిచేయదని, స్థానిక అంశాల ఆధారంగానే ఇక్కడ ఎన్నికలు జరుగుతున్నాయన్నారు.
భర్త కోసం ఇంటింటికీ శివ కుమార్ భార్య..
డీకే శివ కుమార్‌కు మద్దతుగా ఆయన సతీమణి ఉష.. గ్రామాల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు. కనకపురలో ప్రజల ఇంటింటికీ వెళ్లి కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని కోరుతున్నారు. అయితే ఉష చాలా అరుదుగా బహిరంగంగా కనిపిస్తారు. కానీ ఈసారి ఆమె ఓటర్ల వద్దకు వెళ్లి భర్తకు ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు.