KP Chowdhary Police Custody Completed : డ్రగ్స్ కేసులో అరెస్టయిన సినీ నిర్మాత కృష్ణ ప్రసాద్ చౌదరి కస్టడీ ముగిసింది. న్యాయస్థానం అనుమతితో హైదరాబాద్ రాంజేంద్రనగర్ పోలీసులు ఆయన్ను రెండు రోజుల పాటు కస్టడీకి తీసుకొని వివిధ అంశాలపై విచారించారు. ముఖ్యంగా నైజీరియాకు చెందిన గాబ్రియల్, డ్రగ్స్ సరఫరాదారు చింతా రాకేశ్‌తో ఉన్న సంబంధాలపై పోలీసులు ఆరా తీశారు. గోవా, హైదరాబాద్‌లో నిర్వహించిన పార్టీల్లో పాల్గొన్న వారి వివరాలను పోలీసులు సేకరించారు.
మొబైల్ కాల్ డేటా, వాట్సప్ ఛాటింగ్‌ను పోలీసులు.. కేపీ చౌదరి ముందుంచి ఆయనను సుదీర్ఘంగా విచారించారు. సినీ ప్రముఖులకు కేపీ చౌదరీ డ్రగ్స్ సరఫరా చేశారా? అనే కోణంలో పోలీసులు ప్రశ్నించినట్లు సమాచారం. మాదకద్రవ్యాల కొనుగోలు, అమ్మకాలపై కేపీ చౌదరిని అడిగి తెలుసుకున్నారు. కస్టడీ పూర్తి కావడంతో ఆయనను కోర్టులో హాజరుపరచనున్నారు.
ఇదీ జరిగింది: కొకైన్ విక్రయిస్తూ ఈ నెల 14న సుంకర కృష్ణ ప్రసాద్ చౌదరి.. అలియాస్ కేపీ చౌదరి పోలీసులకు చిక్కాడు. అతని వద్ద నుంచి 82.75 గ్రాముల కొకైన్, ఒక కారు, రూ.2.5 లక్షల నగదు, 4 సెల్ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆయనను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఆయన దగ్గర స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ విలువ సుమారు రూ.78 లక్షల విలువ ఉంటుందని పోలీసులు అంచనా వేశారు.
ఇంజినీరింగ్ పూర్తి చేసి.. సినిమా రంగంలోకి: ఖమ్మం జిల్లా బోనకల్‌కు చెందిన కేపీ చౌదరి.. మెకానికల్ విభాగంలో ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. ఆ తరువాత మహారాష్ట్రలో ఏరోనాటికల్ ఇంజినీరింగ్ నిర్వహణ సంచలకుడిగా పని చేశాడు. అనంతరం ఉద్యోగం మానేసి 2016లో సినిమా రంగంపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. రజనీకాంత్ నటించిన కబాలి సినిమాకు తెలుగులో నిర్మాతగా వ్యవహరించాడు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, సర్దార్ గబ్బర్ సింగ్, అర్జున్ సురవరం లాంటి సినిమాలకు డిస్ట్రిబ్యూటర్‌గా వ్యవహరించాడు.
KP Chaudhary remanded : ఆ తరువాత రెండు సినిమాలకు నిర్మాతగా వ్యహరించిన ఆయన తీవ్రంగా నష్టపోయారు. అనంతరం 2021లో గోవాకు వెళ్లారు. అక్కడ ఓఎమ్హెచ్ క్లబ్‌ను ప్రారంభించారు. తెలుగు, తమిళ సినీ పరిశ్రమలో తనకున్న పరిచయాలతో నటీనటులకు ఖరీదైన పార్టీలు ఇస్తూ.. సినీ గ్లామర్‌తో క్లబ్ సజావుగానే సాగించారు. ఈ క్రమంలో ఓఎమ్హెచ్ హోటల్ నిర్మాణం అక్రమ కట్టడమంటూ గోవా మున్సిపల్ సిబ్బంది దానిని కూల్చి వేశారు. దీంతో కేపీ చౌదరి భారీగా నష్టపోయారు. దానిని భర్తీ చేసుకునేందుకు గోవాలో డ్రగ్స్ విక్రయించే ముఠాలతో చేతులు కలిపినట్లు పోలీసులు వెల్లడించారు.
ఇవీ చదవండి: